- ఎఫ్‌సిఐ మూలధన పెట్టుబడి కోసం రూ.10,700 కోట్లు ఈక్విటీ : కేంద్ర మంత్రి వర్గం నిర్ణయాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉన్నత విద్యా సంస్థల్లో చేరే ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. పిఎం విద్యాలక్ష్మి పథకం కింద ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు ‘విద్యా లక్ష్మి పథకం’ ద్వారా రుణాలు పొందవచ్చన్నారు. ఈ రుణాలకు కొలేటరల్, గ్యారంటర్ అవసరం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా 860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ హామీతో రూ.7.50 లక్షల వరకూ రుణం పొందవచ్చు. రుణంలో 75 శాతం బ్యాంకులకు కేంద్రం గ్యారెంటీ ఇస్తుంది. ఈ పథకం కింద ఏటా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల వరకూ ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. పిఎం విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు నేరుగా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఎఫ్‌సిఐకి మూలధన పెట్టుబడి కోసం రూ.10,700 కోట్లు ఈక్విటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)కు మూలధన పెట్టుబడి కోసం రూ.10,700 కోట్ల ఈక్విటీని సమకూర్చడానికి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఎఫ్‌సిఐ తక్షణ ఆర్థిక అవసరాల కోసం స్వల్ప కాలిక రుణాలపై ఆధారపడుతోందని, ఇప్పుడు లభించే ఈక్విటి సంస్థ వడ్డీ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని కూడా తగ్గిస్తుందని అన్నారు.