న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోతోంది. సోమవారం రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అధ్వానస్థితికి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటేసింది. ఏక్యూఐ 400 దాటితే అది ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం … సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఆనంద్ విహార్‌లో 433, వజీర్‌పూర్‌లో 414, జహంగీర్‌పురిలో 413, రోహిణి ప్రాంతంలో 409, పంజాబీ బాగ్‌లో 404గా గాలి నాణ్యత నమోదైంది. పలు ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువ స్థాయిల్లో ఏక్యూఐ నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
కనిపించకుండాపోయిన తాజ్‌మహల్ …
ఆగ్రా, నోయిడాతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్‌లో దట్టంగా పొగ కమ్ముకున్నది. కాలుష్యం ధాటికి తాజ్‌మహల్ కనిపించకుండా పోయింది. గత 10 నుంచి 12 రోజుల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక యమునా నది నురగలు కక్కుతున్నది. పెద్దమొత్తంలో నురగ నదిపై ప్రవహిస్తున్నది. కాగా రానున్న మూడు రోజుల్లో రాజధాని పొగ మంచు కమ్మేసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి వేగం గంటకు 10 కిమీ కంటే తక్కువగా ఉంటుందని.. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
గాలి కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు …
దేశ రాజధానిలో దీపావళి రాత్రి అధిక స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌లు గరిష్ఠ సాయి 999కి చేరాయి. ఏక్యూఐ 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువును పీల్చుకుంటున్న ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.