తప్పుడు కథనాలపై కోర్టును ఆశ్రయించిన ఆరాధ్య బచ్చన్‌

న్యూఢిల్లీ : తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రచురించిన తప్పుడు కథనాలను తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ప్రముఖ బాలీవుడ్‌ దంపతులు ఐశ్వర్యరారు-అభిషేక్‌ బచ్చన్‌ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం గూగుల్‌కు నోటీసులిచ్చింది. కొన్ని వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా వేదికలు గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో ఆమె రెండోసారి పిటిషన్‌ వేశారు. ఆరాధ్య బచ్చన్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ‘ఇక లేరు’ అంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేసున్న ప్రచారంపై ఆరాధ్య, ఆమె తండ్రి అభిషేక్‌ రెండేళ్ల క్రితం వ్యాజ్యం వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రతి చిన్నారిని గౌరవంగా చూడాలని, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం సహించదని పేర్కొంది. ఆ వీడియోలను యూట్యూబ్‌ వేదిక నుంచి తొలగించాలని గతంలో గూగుల్‌ను ఆదేశించింది. ఇలాంటి వీడియోలు గూగుల్‌ దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చినా.. వాటిని తొలగించాలని స్పష్టం చేసింది. ఇక తాజా పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి 17న జరగనుంది.

➡️