సిబిఐ దర్యాప్తును ఎదుర్కొంటూ పదవుల్లో కొనసాగుతున్నారా?

  • వెంటనే వివరాలివ్వండి
  • ‘అభయ’ కేసులో సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ : ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారం, హత్యతో సంబంధమున్న వారు ఎవరైనా ఇంకా ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో అధికార పదవుల్లో వున్నారా లేదా తెలుసుకోవాల్సిందిగా సిబిఐని సుప్రీం కోర్టు సోమవారం కోరింది. తదుపరి విచారణ తేదీకల్లా ఈ సమాచారాన్ని తమకు అందజేయాల్సిందిగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఆర్థిక అవకతవకలతో సం బంధముందని ప్రస్తావించబడిన వ్యక్తులు నేరం జరిగిన ప్రాంతంలో కూడా వున్నారని, వారు ఇప్పటికీ బెదిరింపులకు పాల్పడుతున్నారని జూనియర్‌ డాక్టర్లు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాటిని విచారించిన బెంచ్‌పై ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యక్తులను సస్పెండ్‌ చేయాలని లేదా సిబిఐ దర్యాప్తు ముగిసే వరకు సెలవుపై పంపాలని జూనియర్‌ డాక్టర్ల తరపు న్యాయవాదులు కరుణా నందీ, ఇందిరా జైసింగ్‌ కోరారు. ఆ వ్యక్తులెవరో వారి పేర్లను సిబిఐకి తెలియజేయాల్సిందిగా కోర్టు జూనియర్‌ డాక్టర్లను కోరింది. సిబిఐ ఆ పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుందని, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సింది బెంగాల్‌ ప్రభుత్వమని చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ‘ఆ వ్యక్తులు’ ఆర్‌జి కర్‌కే పరిమితం కాలేదని, పరీక్షల బోర్డు, బెంగాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వంటి సంస్థల పదవుల్లో కూడా వున్నారని న్యాయవాదులు తెలిపారు. వారెవరో చెబితే తాము చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ ద్వివేది చెప్పారు.

➡️