వక్ఫ్‌ బిల్లుపై జెపిసిలో వాగ్వాదం

Aug 23,2024 23:43 #Argument in JPC, #Waqf Bill\

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2024పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) మొదటి సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్యానెల్‌లోని పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లులోని నిబంధనలు భావప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమానత్వ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించిన 40 సవరణలు రాజ్యాంగ విరుద్ధం, మైనార్టీల హక్కులను హరించేవిగా ఉన్నాయని వారు ఎత్తి చూపారు. ప్రత్యేకించి వివాదాస్పద ఆస్తి యాజమాన్యంపై నిర్ణయం తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారం కల్పించే ప్రతిపాదనపై, ముస్లిమేతరులను కూడా వక్ఫ్‌ బోర్డులో సభ్యులుగా చేర్చడంపై ప్రతిపక్ష సభ్యులు గట్టిగా నిలదీశారు. దాదాపు ఆరు గంటల సేపు జరిగిన ఈ సమావేశంలో బిజెపి సభ్యులకు, ప్రతిపక్ష సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. చర్చ అర్థవంతంగా జరిగిందని, జెపిసి తదుపరి సమావేశంఈ నెల30 జరుగుతుందని సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ జగదంబికా పాల్‌ తెలిపారు.
వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వామపక్షాలతో బాటు కాంగ్రెస్‌, టిఎంసి, డిఎంకె, ఆప్‌, వైసిపి, ఎంఐఎం తదితర పార్టీలు వ్యతిరేకించగా, బిజెపి మద్దతు ఇచ్చింది. బిజెపి మిత్రపక్షాలు జెడియు, ఎల్‌జెపి (రామ్‌విలాస్‌), టిడిపి ‘తటస్థ’ వైఖరి తీసుకున్నాయి. జెడియు, ఎల్‌జెపి (రామ్‌విలాస్‌) ముస్లిం సంఘాలు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిష్కరించాలని కోరుతున్నాయి..ఈ నెల 8న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరి రోజున కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో హడావుడిగా ప్రవేశపెట్టిన వక్ఫ్‌ (సవరణ) బిల్లును జెపిసికి నివేదించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌షభలో బిజెపికి సొంతంగా మెజార్టీ లేకపోవడం, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా కష్టమవుతుందని గ్రహించిన మోడీ సర్కార్‌ ప్రతిపక్షాల డిమాండ్‌కు తలగ్గింది. సీనియర్‌ ఎంపి జగదాంబికా పాల్‌ నేతృత్వంలోని జెపిసిలో పార్లమెంటు ఉభయ సభల నుంచి 31 మంది ఎంపిలు ఉన్నారు. అందులో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. జెపిసి తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సమర్పించవచ్చని భావిస్తున్నారు.
బిల్లు ఆమోదయోగ్యం కాదు: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి
సమావేశం అనంతరం వైసిపి ఎంపి వి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమన్నారు. ఈ బిల్ల్లు హేతుబద్ధతతో తాను ప్రశ్నించానని చెప్పారు.. ఈ బిల్లుపై భాగస్వామ్య పక్షాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. ప్రస్తుత రూపంలో ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. . ఈ సమావేశంలో నసీర్‌ హుస్సేన్‌, గౌరవ్‌ గొగోరు (కాంగ్రెస్‌), కళ్యాణ్‌ బెనర్జీ (టిఎంసి), వి విజయసాయి రెడ్డి (వైసిపి), అసదుద్దీన్‌ ఒవైసి (ఎంఐఎం), ఎ రాజా (డిఎంకె), అరుణ్‌ భారతి (ఎల్‌జెపి), సంజరు సింగ్‌ (ఆప్‌), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి) తదితరులు పాల్గన్నారు.
వక్ఫ్‌ బిల్లును జెడియు, టిడిపి వ్యతిరేకిస్తాయి : ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షులు
వక్ఫ్‌ బిల్లును ఎన్‌డిఎ మిత్రపక్షాలు జెడియు, టిడిపి వ్యతిరేకిస్తాయని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) అధ్యక్షులు ఖలీద్‌ సైఫుల్లా రహ్మానీ తెలిపారు. ఎన్‌డిఎ మిత్రపక్షాలైన చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌ను కలిశామని, వక్ఫ్‌ బిల్లుపై ఇరువురు నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారని చెప్పారు. ఎఐఎంపిఎల్‌బి, జమియత్‌ ఉలేమా-ఎ-హింద్‌, ఇతర ప్రధాన ముస్లిం సంఘాలు సమిష్టిగా లోక్‌సభలో సమర్పించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఒకవేళ ఆమోదం పొందితే బిల్లును రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించాయి. శుక్రవారం నాడిక్కడ స్థానిక కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఎఐఎంపిఎల్‌బి, జమియత్‌ ఉలేమా-ఇ-హింద్‌ సంయుక్త విలేకరుల సమావేశంలో ఎఐఎంపిఎల్‌బి ప్రధాన కార్యదర్శి మొహ్మద్‌ ఫజ్లూర్‌ రహీం ముజద్దేది, జమియత్‌ ఉలేమా-ఇ-హింద్‌ అధ్యక్షులు అర్షద్‌ మదానీతో కలిసి ఖలీద్‌ సైఫుల్లా రహ్మానీ మాట్లాడారు. ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ కూడా బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. లౌకికవాదానికి, రాజ్యాంగానికి ఈ బిల్లు విరుద్ధమని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మార్పులు ముస్లిముల ఆస్తులను లాక్కోవడానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు రూపొందించేముందు ప్రభుత్వం తమతో సంప్రదించలేదని, చర్చించేందుకు వీలు లేకుండా ముస్లిములకు తలుపులు మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జెపిసిలో లోక్‌సభ సభ్యులు
లోక్‌సభ నుంచి ప్యానెల్‌లో 21 మంది సభ్యుల్లో 12 మంది ఎన్‌డిఎకు చెందిన వారు. వారిలో ఎనిమిది మంది బిజెపి, ఎన్‌డిఎలోని టిడిపి, జెడియు, శివసేనాషిండే, ఎల్‌జెపి ా రామ్‌విలాస్‌ పార్టీల నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, డిఎంకె, టిఎంసి, ఎస్‌పి, శివసేనాథాకరే, ఎన్‌సిాశరద్‌పవార్‌, ఎంఐఎం నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉన్నారు.
జెపిసిలో రాజ్యసభ సభ్యులు
జెపిసిలో రాజ్యసభ నుంచి పది మంది సభ్యులు ఉన్నారు. బిజెపి నుంచి నలుగురు, ప్రతిపక్ష ఇండియా ఫోరం నుంచి నలుగురు, ఒకరు వైసిపి, ఒక నామినేటెడ్‌ సభ్యుడు ఉన్నారు.

బిల్లును వెనక్కి తీసుకోండి : సిపిఎం ఎంపి రాధాకృష్ణన్‌
సిపిఎం ఎంపి కె రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లు దేశానికి ముఖ్యమైన భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన మత హక్కుకు వ్యతిరేకమైనదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25, 26, 27, 28, 29, 30కు విరుద్ధంగా ఉందన్నారు. ఈ బిల్లు ప్రకారం వక్ఫ్‌ బోర్డు అనేది నామినేటెడ్‌ బోర్డు కాబోతుందని, ఈ బిల్లు తీసుకురాకముందు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో ఎటువంటి సంప్రదింపులూ చేయలేదని విమర్శించారు. ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️