న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీపావళి పండుగకి టపాసులు పేల్చవద్దని ఢిల్లీవాసులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అయితే ఈ పండుగరోజున బాణాసంచా కాల్చితే ఏర్పడే కాలుష్యం వల్ల ఢిల్లీవాసులు, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఆంక్షలు కేవలం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో భాగమే. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పటాకులు పేల్చకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెబుతున్నాయి. ఇది వెలుగుల పండగే కానీ. పటాకుల్ని కాల్చి కాలుష్యాన్ని పెంచే పండగ కాదు. పటాకులు కాల్చడం వల్ల మనకెవరికీ మేలు జరగదు. మన కోసం, మన కుటుంబం కోసం… మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాలి. ఏ కాలుష్యం వచ్చినా.. మన పిల్లలు బాధపడతారు. ఇక్కడ హిందూ ముస్లిం అనే తేడా లేదు. ప్రతి ఒక్కరి జీవితం ముఖ్యమే’ అని ఆయన అన్నారు.