Tihar jail : కేజ్రీవాల్‌ 2 కేజీల బరువు మాత్రమే తగ్గారు

న్యూఢిల్లీ :  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేవలం 2 కేజీల బరువు మాత్రమే తగ్గారని జైలు వర్గాలు ప్రకటించాయి. జైలులో కేజ్రీవాల్‌ 8.5 కేజీలు బరువు తగ్గారంటూ ఆప్‌ నేతల ప్రకటనలపై సోమవారం జైలు అధికారులు  నివేదికను విడుదల చేశాయి.  ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు ద్వారాక్రమం తప్పకుండా కేజ్రీవాల్‌ను పర్యవేక్షిసున్నారని అన్నారు.  ఆప్‌ మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలపై జైలు యంత్రాంగం ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖకు లేఖ రాసింది. ఇటువంటి కథనాలు ప్రజలను గందరోళానికి  గురిచేస్తాయని,  తప్పుదోవపటిస్తాయని ఆ వర్గాలు తెలిపాయి.

తీహార్‌ అధికారులు విడుదల చేసిన కేజ్రీవాల్‌ ఆరోగ్య నివేదిక ప్రకారం.. ఏప్రిల్‌ 1న మొదటిసారి జైలుకు వచ్చినపుడు కేజ్రీవాల్‌ బరువు 65 కేజీలు. ఏప్రిల్‌ 8, 29 మధ్య 66 కేజీలు. 21 రోజుల బెయిల్‌ తర్వాత జూన్‌ 2న తిరిగి జైలుకు వచ్చినపుడు ఆయన బరువు 63.5 కేజీలు. జులై 14న కేజ్రీవాల్‌ బరువు 61.5 కేజీలు. ఆయన 2కేజీల బరువు కోల్పోయాడని పేర్కొంది.
కేజ్రీవాల్‌ బిపి, షుగర్‌, బరువు క్రమం తప్పకుండా వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, తగిన చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. రోజూ మూడు సార్లు ఇంటి నుండి వచ్చిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారని తెలిపాయి.

నివేదికపై స్పందించిన సంజయ్  సింగ్‌
జైలు అధికారుల లేఖపై ఆప్‌ నేత సంజయ్  సింగ్‌ స్పందించారు. కేజ్రీవాల్‌ బరువు తగ్గారని జైలు అధికారులు ఆమోదించారని అన్నారు. నిద్రలో ఉన్న సమయంలో షుగల్‌ లెవల్స్‌ తగ్గితే కేజ్రీవాల్‌ కోమాలోకి వెళ్లవచ్చని, లేదా బ్రెయిన్‌ స్ట్రోక్‌ కు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

కేజ్రీవాల్‌ను జైలులో బంధించడం ద్వారా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు బిజెపి కుట్ర చేస్తోందని, షుగర్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు అవసరమైన వైద్యం జైలు అధికారులు అందించడం లేదని ఆప్‌ నేతలు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.  కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయినప్పటి నుండి అస్పష్టంగా 8.5 కేజీల బరువు తగ్గారని ఢిల్లీ కేబినెట్‌ మినిస్టర్‌ అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో షుగర్‌ లెవల్స్‌ 50 ఎంజి/డిఎల్‌ కన్నా తక్కువగా ఐదు సార్లు పడిపోయాయని పేర్కొన్నారు.

➡️