పార్లమెంట్‌ వేదికగా గంగానది నీటిపై వాదనను సమర్ధించుకున్న కేంద్రం

న్యూఢిల్లీ : గంగానది నీటిపై సోమవారం పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాదనను సమర్థించుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఇచ్చిన కొత్త నివేదికను ఉటంకిస్తూ.. ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది నీరు స్నానానికి అనువుగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గంగానది నీటిని శుభ్రం చేసేందుకు 2022-23, 2023-24 మరియు 2024-25లో జాతీయ మిషన్‌ (ఎన్‌ఎంసిజి)కి మొత్తం రూ.7,421 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.

సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) ఎంపి ఆనంద్‌ భదౌరియా, కాంగ్రెస్‌ ఎంపి కె.సుధాకరన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సమాధానమిచ్చారు. సిపిసిబి నివేదిక ప్రకారం… పర్యవేక్షించిన అన్ని ప్రదేశాలలో పిహెచ్‌ విలువలు (పిహెచ్‌), కరిగిన ఆక్సీజన్‌ (డిఒ), జీవ ఆక్సీజన్‌ డిమాండ్‌ (బిఒడి), కొలిఫాం బ్యాక్టీరియా (ఎఫ్‌సి) సగటు విలువలు స్నానానికి అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నాయని అన్నారు.

ఫిబ్రవరి 3న సిపిసిబి ఒక నివేదికలో కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌ రాజ్‌లోని అనేక ప్రాంతాల్లోని నీటిలో మల కోలిఫాం స్థాయిలు అధికంగా ఉండటం వలన ప్రాథమికంగా స్నానపు నీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)కి తెలిపింది. అయితే కుంభమేళాలో నీటి నాణ్యత స్నానానికి అనుకూలంగానే ఉందని, గణాంక విశ్లేషణలో తేలిందని సిపిసిబి ఫిబ్రవరి 28న ఎన్‌జిటికి కొత్త నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. వేర్వేరు తేదీలలో ఒకే ప్రాంతం నుండి మరియు ఒకే రోజున వేర్వేరు ప్రదేశాల నుండి సేకరించిన నమూనాలలో సమాచారం వైవిధ్యం కారణంగా గణాంక విశ్లేషణ అవసరమని సిపిసిబి నివేదిక పేర్కొంది. సేకరించిన నమూనాలు నది విస్తీర్ణం అంతటా మొత్తం నది నీటి నాణ్యతను పూర్తిగా ప్రతిబింబించలేవని పేర్కొంది.

➡️