భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలా?

 ఆ ఐదుగురు కోర్టుకు హాజరు కావాలని సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : వికలాంగులపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిందుకు కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఐదుగురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లను సుప్రీం కోర్టు సోమవారం కోరింది. వీరిలో ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ హోస్ట్‌ సమరు రైనా కూడా వున్నారు. వెన్నెముకకు సంబంధించి అత్యంత అరుదైన వైకల్యం (ఎస్‌ఎంఎ)తో బాధపడుతున్న వ్యక్తులను ఉద్దేశించి అపహాస్యం చేస్తూ వారు వారి షోలో వ్యాఖ్యలు చేశారని ఎన్‌జిఓ ‘క్యూర్‌ ఎస్‌ఎంఎ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన బెంచ్‌ విచారణ జరిపింది. వారందరూ కోర్టుకు హాజరయ్యేలా నోటీసులు జారీ చేయాలని ముంబయి పోలీసు కమిషనర్‌ను కోరింది. లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. వికలాంగులు, అత్యంత అరుదైన వ్యాధులు, సమస్యలతో బాధపడుతున్న వారికి సంబంధించిన సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారాన్ని క్రమబద్ధీకరించడంపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలంటూ అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణికి బెంచ్‌ సూచించింది. అటువంటి వైకల్యంతో బాధపడుతున్న వారిని ఇలా అపఖ్యాతి పాల్జేయడమంటే వారిని నైతికంగా దెబ్బతీయడమేనని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని స్పష్టం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలను అనుమతించలేమని పేర్కొంది. ఇటువంటి వాటికి సంబంధించి సోషల్‌ మీడియా కంటెంట్‌ విషయంలో మార్గదర్శకాలు రూపొందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతమున్న చట్టంలో ఇందుకు సంబంధించి లొసుగులు వున్నాయని, అందువల్ల ఆన్‌లైన్‌ కంటెంట్‌పై మార్గనిర్దేశకాలు అవసరమని ఎన్‌జిఓ పేర్కొంది.

➡️