ఆశారామ్‌కు మధ్యంతర బెయిల్‌

న్యూఢిల్లీ : బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో శిక్ష అనుభవిస్తున్న వివాదస్పద అధ్యాత్మిక గురువు ఆశారామ్‌కు మధ్యంతర బెయిల్‌ లభించింది. 86 ఏళ్ల ఆశారామ్‌కు వైద్య చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆయన న్యాయవాది కోరగా.. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం మార్చి 31 వరకూ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయన ఎవ్వరినీ కలవరాదని, అనుచరులతో సమావేశం కారాదని షరతులు విధించింది. కాగా శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆశారామ్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 2013లో ఆశమ్రంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోక్సో కోర్టు ఆశారాంకు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకూ 11 ఏళ్ల జైలు శిక్షను ఆశారాం అనుభవించారు. కాగా, మరో అత్యాచారం కేసులోనూ గుజరాత్‌లోని గాంధీనగర్‌ సెషన్స్‌ కోర్టు గతేడాది జనవరిలో ఆశారాంకు జీవిత ఖైదు విధించింది.

➡️