- రాజ్యసభలో కేంద్ర మంత్రి జెపి నడ్డా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆశా వర్కర్లకు ప్రోత్సాహకాల అంశంపై రాజ్యసభను పదే పదే తప్పుదారి పట్టించే ఆరోగ్య మంత్రి జెపి నడ్డా చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి. గురువారం రాజ్యసభలో నడ్డా సమాధానమిస్తూ ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహకాలను పెంచే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని అన్నారు. వారం క్రితం నడ్డా సభలో మాట్లాడుతూ త్వరలో ప్రోత్సాహకాన్ని పెంచే విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. దీనికి విరుద్ధంగా మంత్రి గురువారం ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇస్తున్నది మంచి ప్రోత్సాహకమని అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖపై చర్చలో సిపిఎం ఎంపి వి. శివదాసన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల అంశంపై బిజెపి, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టారు. ”కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహకంగా రూ.1,200 మాత్రమే ఇస్తోంది. ప్రోత్సాహకాలను పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నప్పటికీ, కేంద్రం అలా చేయడానికి సిద్ధంగా లేదు. కేరళలో జరుగుతున్న ఆశా వర్కర్ల సమ్మెలో ఒక కేంద్ర మంత్రి పాల్గొని వారిని మోసం చేశారు. కేరళ ఆశా కార్యకర్తలకు అధిక గౌరవ వేతనం చెల్లిస్తుంది. కేరళలోని కాంగ్రెస్ నాయకులకు ఈ నిజం చెప్పే ధైర్యం లేదు. కొంతమంది ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తమ నాయకులలో కొందరు బిజెపి కోసం పనిచేస్తున్నారని బహిరంగంగా ప్రకటించారు. కేరళ విషయంలో ఇది చాలా నిజం. వారు బిజెపికి తోకలా వ్యవహరిస్తున్నారు” అని విమర్శించారు. ఎంపి శివదాసన్‌కు ఇచ్చిన సమాధానంలో మోడీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహకాలను అందిస్తోందని, వారిని, కుటుంబ సభ్యులను సామాజిక భద్రతా పథకాలలో చేర్చామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.