ఢిల్లీలో కదం తొక్కిన ఆశా వర్కర్లు

Nov 30,2024 00:25 #Asha Workers, #Delhi dharna
  • రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌
  • కనీస వేతనం, ఇతర సమస్యల పరిష్కారం కోసం సంఘర్ష్‌ ర్యాలీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లు కదంతొక్కారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సిబ్బంది అందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని నినదించారు. ఆశా వర్కర్లను, సహాయకులను రెగ్యులర్‌ చేయడంతో పాటు పెన్షన్‌ తదితర సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక జంతర్‌ మంతర్‌ వద్ద సంఘర్ష్‌ ర్యాలీ చేపట్టారు. సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్‌ అండ్‌ ఫెసిలిటేటర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎడబ్ల్యుఎఫ్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది ఆశా వర్కర్లు, సహాయకులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు కె హేమలత తదితరులు ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి నేతృత్వ ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్‌, మతతత్వ అనుకూల విధానాలను తిప్పికొట్టేందుకు శ్రమజీవులంతా కలిసికట్టుగా ఉమ్మడి పోరాటాలను బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హననం చేస్తోందని, అందులో భాగంగానే లేబర్‌ కోడ్‌లను తీసుకొస్తుందని విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో స్థానిక పాలక పక్షాల దుర్మార్గపు విధానాలను వ్యతిరేకిస్తూ అద్భుతమైన పోరాటాలు చేస్తున్న ఆశా వర్కర్లను ఆమె అభినందించారు. అదే పోరాట స్ఫూర్తితో జాతీయ స్థాయిలో పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఎడబ్ల్యుఎఫ్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మధుమిత బందోపాధ్యాయ మాట్లాడుతూ చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్ల, సమస్యలను వివరించారు.

సిపిఎం ఎంపిల సంఘీభావం

ఆశా వర్కర్ల పోరాటానికి సిపిఎం రాజ్యసభ సభ్యులు వికాస్‌ రంజన్‌ భట్టాచార్య, వి శివదాసన్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశాల సమస్యలను రాజ్యసభలో లేవనెత్తుతామని తెలిపారు. ఈ ర్యాలీకి అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) నాయకులు విజు కృష్ణన్‌, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు జైభగవాన్‌, అంగన్‌ వాడీ సంఘం నేత ఎఆర్‌ సింధు తదితరులు ఆశా వర్కర్ల పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేశవ్యాప్తంగా స్కీమ్‌ వర్కర్ల ఉద్యమాన్ని, ఐక్యతను క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు నోని లిక్సన్‌ (అస్సాం), ప్రసన్న కుమారి (కేరళ), మధుజా సేన్‌ రారు (పశ్చిమ బెంగాల్‌), హసుమతి పర్మార్‌ (గుజరాత్‌), ఆనంది మణిక.. (మహారాష్ట్ర), కబితా సోలంకి (మధ్యప్రదేశ్‌), దిల్షాద ( కాశ్మీర్‌), సంగీత (ఉత్తరప్రదేశ్‌), శివ దుబే (ఉత్తరాఖండ్‌), సీమా (పంజాబ్‌), లీలావతి (రాజస్థాన్‌) మాట్లాడారు. అధ్యక్ష వర్గంలో సునీత (హర్యానా), మమతా రభా (అస్సాం), ప్రభావతి ఎంబి (కేరళ), పుష్పా పాటిల్‌ (మహారాష్ట్ర), పూజా కనోజియా (మధ్యప్రదేశ్‌), కళావతి (ఉత్తరాఖండ్‌), మంగమ్మ (తెలంగాణ) ఉన్నారు.

వేతనాలు పెంచకపోతే సమ్మెకు సిద్ధం

ఎడబ్ల్యుఎఫ్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సురేఖ ఈ ర్యాలీలో పోరాట కార్యాచరణను ప్రకటించారు. తదుపరి బడ్జెట్‌లో వేతనాలు, ప్రోత్సాహకాలను పెంచకపోతే స్వతంత్రంగా, ఉమ్మడిగా సమ్మె చేపట్టనున్నటు హెచ్చరించారు. అందరికీ ఆరోగ్యం కోసం, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆశా వర్కర్లు అందరూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించింది.

➡️