కాంగ్రెస్‌కి మరో షాక్‌.. మాజీ సిఎం రాజీనామా

Feb 12,2024 15:27 #Ashok Chavan, #Congress, #Maharashtra

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కి మరో షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్‌ చవాన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు.. తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ నానా పటోల్‌కు పంపించారు. అలాగే అశోక్‌ చవాన్‌ భోకర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ను కలిసి తన రాజీనామాను అందజేశారు. కొద్దిరోజుల్లో బిజెపిలో చేరేందుకే అశోక్‌ కాంగ్రెస్‌కి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయనకు బిజెపి రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా, మహారాష్ట్రలోని సీనియర్‌ నేతలంతా కాంగ్రెస్‌ని వీడుతున్నారు. గతనెల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మిలింద్‌ దేవరా కాంగ్రెస్‌ని వీడి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. మళ్లీ కొద్దిరోజుల్లోనే మరో సీనియర్‌ నేత అశోక్‌ కాంగ్రెస్‌ను వీడడం గమనార్హం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావు చవాన్‌ కుమారుడే అశోక్‌ చవాన్‌. ఈయనకు నాందేడ్‌ ప్రాంతంలో గణనీయమైన ప్రభావం ఉంది. ఈ మార్పు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ని దెబ్బతీయవచ్చు.

అశోక్‌ కాలేజీ డేస్‌లో స్టూడెంట్‌ లీడర్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌లో కూడా కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగానూ పనిచేశారు. ఆయన రెండుసార్లు నాందేడ్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల తర్వాత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం అశోక్‌ చవాన్‌ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. అయితే ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో అశోక్‌ తన సిఎం పదవికి రాజీనామా చేశారు. చవాన్‌ కాంగ్రెస్‌కి రాజీనామా చేయడంతో ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ స్పందించారు. బిజెపి వాషింగ్‌ మెషిన్‌ జాబ్‌ తీసుకుంది. తమ వైపుకు మారే ప్రతిపక్షనాయకులపై నేర పరిశోధనలను బిజెపి నిలిపివేస్తుందని జైరాం రమేష్‌ ఆరోపించారు.

➡️