జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ షురూ

  • అధికారికంగా ప్రారంభించిన ఇసిఐ

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) అధికారికంగా ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కేంద్ర పాలిత ప్రాంత (యుటి) శాసనసభకు సాధారణ ఎన్నికల కోసం 1968 ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్‌ అండ్‌ అలాట్‌మెంట్‌) ఆర్డర్‌ 1968లో పేరా 10బి కింద ఉమ్మడి గుర్తును కేటాయించాలని కోరుతూ దరఖాస్తులను ఆమోదించాలని కమిషన్‌ నిర్ణయించిందని ఇసిఐ సెక్రెటరీ జయదేబ్‌ లాహిరి ఒక ప్రెస్‌ నోట్‌ ద్వారా వివరించారు. జమ్మూకాశ్మీర్‌ ప్రజలు తమ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని యూటీలో త్వరలో ఏర్పాటు చేస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నట్టు స్పష్టం చేశారు. 2014లో జమ్మూకాశ్మీర్‌లో చివరి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ నేతృత్వంలోని బిజెపి, పిడిపిల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణం తర్వాత, సంకీర్ణానికి ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ నేతృత్వం వహించారు. జూన్‌ 18, 2019న సంకీర్ణ ప్రభుత్వం నుంచి బిజెపి వైదొలిగింది. ఆ తర్వాత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించబడింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆగస్టు 5, 2019న ఆర్టికల్‌ 370, 35(ఎ)ను మోడీ సర్కారు రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు యూటీలుగా చేసింది. దీంతో అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలనలో ఉన్నది.

➡️