న్యూఢిల్లీ : దేశ రక్షణలో భాగంగా ఎంతో మంది సైనికులు తమ ప్రాణాల్ని కోల్పోతారు. అయితే ప్రమాదవశాత్తూ సైనికులు తమ వృత్తిలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల.. వారి భార్యలు చిన్న వయసులోనే వితంతువులవుతారు. దేశవ్యాప్తంగా ‘సైనిక వితంతువుల’ సంఖ్య 6,98,252 మంది ఉన్నారని రక్షణమంత్రిత్వ శాఖ శుక్రవారం లోక్‌సభకు తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది సైనిక వితంతువులు ఉంటే.. అందులో సగం మంది దాదాపు మూడు లక్షల మంది ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ రాష్ట్రాల్లో 2,99,314 ఉన్నారని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక సైనిక వితంతువులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ టాప్‌లో ఉంది. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే మాజీ సైనికుల వితంతువుల సంఖ్య 74,253 నమోదైనట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అంటే దాదాపు ఈ ఒక్క రాష్ట్రంలోనే 10.63 శాతం మంది వితంతువులు ఉన్నట్లు లెక్క. ఇక పంజాబ్ తర్వాత కేరళ రెండో స్థానంలో నిలిచింది. కేరళలో 69,507 మంది సైనిక వితంతువులు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్, 68,815 మంది, హర్యానా 53,546 మందితో ఆరోస్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్ 48,924, రాజస్థాన్ 44,665, హిమాచల్ ప్రదేశ్ 39,367, జమ్మూ అండ్ కాశ్మీర్ 21,890, ఢిల్లీ 14,029, చండీగఢ్ 2,640మంది సైనిక వితంతువులున్నారని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది.
కాగా, మాజీ సైనికుల వితంతువుల సంక్షేమం గురించి ఎన్‌సిపి ఎంపీ సునీల్ దత్తాత్రే తత్కరే అడిగిన ప్రశ్నకు .. రక్షణ శాఖా సహాయ మంత్రి అజరు భట్ జవాబిచ్చారు. ‘సైనిక వితంతువులు కుటుంబ పెన్షన్‌కు అర్హులు. వీరికందించే పెన్షన్ ప్రతి ఐదేళ్లకూ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపి) కింద సవరించబడుతుంది. అలాగే కుటుంబ పెన్షన్ కూడా ప్రతి ఆరు నెలల తర్వాత సవరించబడే డియర్‌నెస్ రిలీఫ్‌తో ముడిపడి ఉంటుంది. 2022లో మరణించిన రక్షణ సిబ్బందిలో 32 మంది వితంతువులకు కారుణ్య నియామకాలు మంజూరు చేయబడ్డాయని అజరుభట్ లోక్‌సభకు తెలిపారు.