ఐదో దశలో అతివలు అంతంతే..

May 14,2024 00:46

మహిళా అభ్యర్థులు 12 శాతం మందే
– మొత్తం 695 మందిలో వారు 82 మంది : ఏడీఆర్‌
న్యూఢిల్లీ : ఈనెల 20న జరిగే ఐదో దశలో మొత్తం 695 మంది అభ్యర్థుల్లో 82 మంది మాత్రమే మహిళలు ఉన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తెలిపింది. ఏడీఆర్‌ విశ్లేషణ ప్రకారం.. ప్రకారం ఐదో దశలో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో కేవలం 12 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా కొనసాగుతున్నది. దాదాపు 23 శాతం మంది తమపై క్రిమినల్‌ కేసులను ప్రకటించుకున్నారనీ, 18 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
మొదటి దశ ఎన్నికలలో 135 (8 శాతం మంది) మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, రెండో దశలో 100 (8 శాతం) మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అదేవిధంగా, మూడో దశ ఎన్నికలలో 123 (9 శాతం) మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, నాలుగో దశలో 170 (10 శాతం) మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు
ఐదో దశలో పరిశీలనలో ఉన్న 695 మంది అభ్యర్థులలో.. 18 శాతం మంది(122 మంది అభ్యర్థులు)పై హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, ద్వేషపూరిత ప్రసంగాలతో సహా తీవ్రమైన క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పార్టీల వారీగా క్రిమినల్‌ కేసులను చూస్తే.. ప్రధాన పార్టీలలో ఏఐఎంఐఎం నుంచి నలుగురు అభ్యర్థులలో ఇద్దరు (50 శాతం), ఎస్పీ నుంచి 10 మంది అభ్యర్థులలో నలుగురు (40 శాతం), కాంగ్రెస్‌ నుంచి 18 మంది అభ్యర్థులలో ఏడుగురు (39 శాతం), శివసేన నుంచి ఆరుగురిలో ఇద్దరు (33 శాతం), బీజేపీ నుంచి నుంచి 40 మంది అభ్యర్థులలో 12 మంది (30 శాతం), తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నుంచి ఏడుగురిలో ఇద్దరు (29 శాతం), ఆర్జేడీ నుంచి నలుగురిలో ఒకరు (25 శాతం), శివసేన (యూబీటీ) నుంచి ఎనిమిది మందిలో ఒకరు (13 శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు కలిగి ఉన్నారు. 29 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించారు. 29 మంది అభ్యర్థుల్లో ఒకరు లైంగికదాడికి సంబంధించిన అభియోగాలు ( ఐపీసీ సెక్షన్‌ 376), 10 మంది తమపై ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులను వెల్లడించారు.
ఒక్కో అభ్యర్థి సగటు ఆస్థి రూ.3.56 కోట్లు
33 శాతం మంది అభ్యర్థులు ‘కోటీశ్వరులు’ (రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు)గా ఉన్నారు. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.3.56 కోట్లుగా ఉన్నది. 47 శాతం మంది అభ్యర్థులు తమ అప్పులను ప్రకటించారు. కొంతమందికి పదుల కోట్ల రూపాయల వరకు అధిక రుణ భారం ఉండటం గమనార్హం. అయితే, అభ్యర్థుల విద్యార్హతలు ఆందోళన కలిగిస్తున్నాయి. 42 శాతం మంది 5 నుంచి 12వ తరగతి మధ్య విద్యార్హతలు కలిగి ఉన్నారు. కేవలం 50 శాతం మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. 26 మంది అభ్యర్థులు డిప్లొమా హౌల్డర్లు, 20 మంది కేవలం అక్షరాస్యులు, ఐదుగురు నిరక్షరాస్యులు కావటం గమనార్హం.

➡️