న్యూఢిల్లీ : రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం నామినేషన్ పత్రాలను సమర్పించారు. కల్కాజీ నియోజకవర్గం నుండి ఆమె పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు కల్కాజీ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో అతిషితో పాటు ఆప్ నేత మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి కోసం గత ఐదేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేశానని అన్నారు. కల్కాజీ ప్రజలు తన కుటుంబమని, వారు తనను సోదరిగా, కుమార్తెగా భావిస్తారని అన్నారు. తాను కేవలం ఈ నియోజకవర్గ ప్రతినిధిని మాత్రమే కాదని, వారి జీవితంలో ఓ భాగంగా భావిస్తారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆప్ కట్టుబడి ఉందని అన్నారు. బిజెపి పేదలకు వ్యతిరేకి అని, మురికివాడలకు వ్యతిరేకి అని దుయ్యబట్టారు.
అతిషీకి పోటీగా బిజెపి నుండి రమేష్ బిదూరి, కాంగ్రెస్ నుండి మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబాలు బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.