రాజస్థాన్‌లో దారుణం – 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం

Feb 12,2024 09:55 #20, #Gang Rape, #Rajasthan, #women's
  • అంగన్‌వాడీ ఉద్యోగాల ఆశచూపి వంచన

జోధ్‌పుర్‌ : రాజస్థాన్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేదరికం, నిరుద్యోగ రక్కసి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో 20 మంది పేద మహిళలకు ఉద్యోగాలు ఆశగా చూపి ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రాజస్థాన్‌లోని సిరోహికి చెందిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్‌ కౌన్సిల్‌ కమిషనర్‌ మహేంద్ర చౌదరి ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. అంగన్‌వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మహిళలకు ఆశ్రయమిచ్చి అన్ని వసతులు కల్పించారు. మత్తు మందు కలిపిన ఆహారం అందించి స్పృహలో లేని మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. అలా 20 మందిపై ఈ దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి విషయం బయటకు చెప్పకూడదంటూ తమను బెదిరించే వారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.ఐదు లక్షల చొప్పున డబ్బులు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి చేసినట్లు వారు పేర్కొన్నారు. పాలి జిల్లాకు చెందిన ఓ బాధిత మహిళ దుండగుల ఆగడాలపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెకు మరికొందరు మహిళలు తోడుగా నిలిచారు. నిందితులపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేయకుండా.. తాము చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని పోలీసులు కొట్టిపారేసినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఎనిమిది మంది మహిళలు రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిఎస్‌పి పరాస్‌ చౌదరి తెలిపారు.

➡️