జర్మనీ మాజీ చాన్సలర్ మెర్కెల్
న్యూఢిల్లీ: భారత్‌లో నరేంద్ర మోడీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని జర్మనీ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ విమర్శించారు. ఇటీవల విడుదల చేసిన ఫ్రీడమ్ మెమరీస్ (1951-2021) పుస్తకంలో మెర్కెల్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. హిందూత్వ మూకలు ఇతర మతాలకు చెందిన వారిని మరీ ముఖ్యంగా క్రైస్తవులను, ముస్లింలను టార్గెట్‌గా పెట్టుకుని దాడులకు దిగడాన్ని ఆమె ప్రస్తావించారు. 2015 ఏప్రిల్‌లో జర్మనీ పర్యటనకు వచ్చిన మోడీతో జరిపిన సమావేశంలో ఇదే అంశాన్ని తాను లేవనెత్తానని, అయితే, మోడీ దానిని తీవ్రంగా తోసిపుచ్చారని అన్నారు. . తన ఆరోపణలను మోడీ తోసిపుచ్చినప్పటికీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉందన్నారు. భారత్‌లో మత స్వేచ్ఛపై తన ఆందోళనలు అలాగే మిగిలిపోయాయని మెర్కెల్ పేర్కొన్నారు. ఏ ప్రజాస్వామ్యానికైనా కీలకం మత స్వేచ్ఛ అని ఆమె నొక్కిచెప్పారు.
2015 ఏప్రిల్‌లో జర్మనీలో మోడీతో తన మొదటి సమావేశాన్ని మెర్కెల్ వివరిస్తూ, ‘ఆయనకు.(మోడీకి) విజువల్ ఎఫెక్టు అంటే మోజు ఎక్కువ ‘ అని పేర్కొన్నారు. మోడీ తన ఎన్నికల ప్రచారం గురించి ఆమెతో మాట్లాడుతూ, ‘తాను స్టూడియోలో మాట్లాడిన విషయాన్ని, తన చిత్రాన్ని 50కిపైగా ప్రదేశాల్లో ‘హోలోగ్రామ్’ గా ప్రదర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మోడీ హోలోగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగించారని ఆమె పేర్కొన్నారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో తన సమావేశాన్ని గురించి మెర్కెల్ వివరించారు. విస్తృత స్థాయి ప్రపంచ అనుభవం కలిగిన ఆర్థిక వేత్త భారత దేశ ‘ మొట్టమొదటి హిందువేతర ప్రధాని ‘ అంటూ మన్మోహన్ సింగ్‌ను ఆమె అభివర్ణించారు. భారత దేశంలో అప్పటికి ఉన్న 120 కోట్ల జనాభాలో మూడింట రెండొంతుల మంది జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వీటి గురించే ఆయన ఎక్కువగా మాట్లాడారు. జర్మనీ జనాభా (8 కోట్టు) కన్నా భారత్ జనాభా అనేక రెట్లు అధికం. ఆయనతో తన సంభాషించినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల సంపన్న దేశాల వైఖరిపై ఆయనకున్న అనుమానాలను అర్థం చేసుకున్నాను. మన్మోహన్ సింగ్ తన దేశ సాంస్కృతిక వైవిధ్యం గురించి, అయిదు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉపఖండం గురించి చెప్పారు. భారత రాజ్యాంగం 22 అధికారిక భాషలను గుర్తించిన విషయాన్ని , భిన్నత్వంలో ఏకత్వం గొప్పతనాన్ని గురించి చెప్పారని మెర్కెల్ పేర్కొన్నారు.
