రాష్ట్రాల వాటా కుదింపునకు యత్నం : ప్రధాని మోడీపై అల్‌ జజీరా కథనం

  • ఆర్థిక కమిషన్‌ వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు

న్యూఢిల్లీ : 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారని అల్‌ జజీరా మీడియా నెట్‌వర్క్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందుకోసం ఆయన కేంద్ర ఆర్థిక సంఘాన్ని రహస్యంగా సంప్రదించారని, దాని అధిపతి వైవి రెడ్డి వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారని అల్‌జజీరా తెలిపింది. ‘ఆర్థిక సంఘం దృఢ వైఖరి అవలంబించడంతో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్ర పన్నుల్లో అధిక వాటా పొందాలన్న ప్రయత్నం బెడిసికొట్టడంతో బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపును కుదించింది’ అని వివరించింది.

నీతి ఆయోగ్‌ సిఇఒ బివిఆర్‌ సుబ్రమణ్యం గత సంవత్సరం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో అనేక పొరలు ఉంటాయని, అవి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. చర్చా గోష్టికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. అల్‌ జజీరా ప్రతినిధులు ఈ విషయంపై ప్రధాని కార్యాలయానికి ఓ ప్రశ్నావళిని పంపడంతో ఆ వీడియోను తొలగించారు. పత్రాలు, బడ్జెట్‌ పద్దులను పరిశీలించిన పాత్రికేయులు మోడీ ప్రయత్నాలను స్వతంత్రంగా ధ్రువీకరించారు. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32శాతం నుంచి 42శాతానికి పెంచాలని సూచిస్తూ ఆర్థిక సంఘం 2014 డిసెంబర్‌లో నివేదికను సమర్పించింది. మోడీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్నుల్లో రాష్ట్రాల వాటాను 33శాతానికి పరిమితం చేయాలని భావించాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ విషయంలో ప్రభుత్వానికి రెండు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించడం లేదా వాటిని తిరస్కరించి కొత్తగా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం. అంతే తప్ప వాటిపై వాదించడం, చర్చించడం లేదా సంప్రదింపులు జరపడం చేయకూడదు. ప్రధాని మోడీ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ వైవి రెడ్డిని రహస్యంగా సంప్రదించారు. అంతకుముందు ఆయన రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నరుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సంఘాన్ని సంప్రదించడం రాజ్యాంగ బద్ధతను ఉల్లంఘించడమే అవుతుంది. ఒకవేళ ఆ విషయంలో ప్రభుత్వం విజయం సాధించి ఉంటే ఆర్థిక సంఘంపై నిందలు మోపి, రాష్ట్రాల వాటాను తగ్గించేది. త్రైపాక్షిక చర్చల్లో ప్రధాని, వైవి రెడ్డి, తాను పాల్గొన్నామని సుబ్రమణ్యం చెప్పారు. అందులో ఆర్థిక మంత్రి కానీ, ఆ శాఖ అధికారులు కానీ భాగస్వాములు కాలేదని తెలిపారు. రెండు గంటల పాటు సంప్రదింపులు జరిగాయని, కానీ ప్రధాని సూచనకు ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అంగీకరించలేదని తెలిపారు. ‘బ్రదర్‌… ఆయనకు వేరే మార్గం లేదని మీ బాస్‌ (ప్రధాని)కి చెప్పండి’ అని రెడ్డి తనతో అన్నారని చెప్పారు. తెరచాటు చర్చలు విఫలమైనప్పటికీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించిన విషయాన్ని పార్లమెంటుకు తెలియజేయకుండా ప్రధాని దాచిపెట్టారు.

➡️