- నాలుగు కోట్ల మందికే పన్ను ప్రయోజనం
- మిగిలిన 140 కోట్ల మంది భారతీయులపై భారాలు
- జిఎస్‌టి హేతుబద్ధీకరణ పట్టని మోడీ సర్కార్
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి గ్రామీణ ప్రజలకు మొండిచేయి చూపించింది. పట్టణ ప్రజానీకానికి…అది కూడా వేతన జీవులకు మాత్రమే కొంత ఊరట కల్పించి చేతులు దులుపుకుంది. ఆదాయపన్ను మినహాయింపుల కారణంగా ప్రభుత్వ ఖజానాపై లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందంటూ మొసలి కన్నీరు కార్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ వార్షిక జీతం రూ.12 లక్షలు అయితే అందులో రూ.80 వేలు ఆదా చేయగలరు. ఏడాదికి కోటి రూపాయలు ఆర్జిస్తుంటే ఐదు లక్షల రూపాయలు వెనకేసుకోగలరు. ఇదీ బడ్జెట్ అంకెల గారడీ.
ఉద్దీపనల ఫలాలు ఎవరికి?
దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే వినియోగ విప్లవం రావాలని కొందరి అభిప్రాయం. దేశంలో సుమారు ఎనిమిది కోట్ల మంది ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తుంటారు. వారిలోనూ సగం మందివి జీరో-ట్యాక్స్ రిటర్న్‌లే. కాబట్టి వినియోగ విప్లవం అనేది కేవలం నాలుగు కోట్ల మందికి మాత్రమే పరిమితం. అయితే దేశ జనాభా 140 కోట్లు. మరి మిగిలిన వారి సంగతేమిటి?. మన దేశంలో ప్రయివేటు వినియోగ వ్యయం సుమారు రూ.200 లక్షల కోట్లు. కాబట్టి ఈ పన్ను ఉద్దీపనలు మొత్తం విలువలో కేవలం 0.5 శాతం మాత్రమే.
జిఎస్‌టి రేట్లను తగ్గిస్తే…
ఏదో కంటి తుడుపు చర్యగా పన్ను మినహాయింపులు ప్రకటించడానికి బదులు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జిఎఎస్‌టి రేట్లను తగ్గించి ఉంటే ప్రజల కొనుగోలు సామర్ధ్యం కచ్చితంగా పెరిగి ఉండేది. కేవలం నాలుగు కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల కొనుగోలు శక్తే కాదు….మొత్తం 140 కోట్ల భారతీయుల కొనుగోలు శక్తి కూడా పెరిగేది. కానీ ప్రభుత్వం ఇక్కడ ఓ తిరకాసు పెడుతోంది. జిఎస్‌టి రేటు అనేది కేంద్ర బడ్జెట్‌లో నిర్ణయించేది కాదని, దానిని జిఎస్‌టి మండలి నిర్ణయిస్తుందని చెబుతోంది. నిజం చెప్పాలంటే అది ఓ కుంటిసాకు మాత్రమే.
రక్తాన్ని పీలుస్తున్న వ్యవస్థ
కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి జిఎస్‌సటి మండలిలో స్పష్టమైన ఆధిక్యత ఉంది. కాబట్టి జీఎస్టీని పెంచాలన్నా, తగ్గించాలన్నా నిర్ణయాధికారం పరోక్షంగా బిజెపిదే. ప్రస్తుతం జీఎస్టీ గరిష్ట రేటు 18 శాతం. లగ్జరీ రేటు 28 శాతం. గత ఎనిమిది సంవత్సరాలుగా వీటిలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. పేదలు, మధ్య తరగతి ప్రజలతో పాటు అధిక జీతాలు తెచ్చుకుంటున్న భారతీయుల రక్తాన్ని విపరీతమైన, తిరోగమన పన్ను వ్యవస్థ పీల్చి పిప్పి చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
అరకొర మినహాయింపులతో ఏం లాభం?
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. పేద, మధ్య తరగతి కుటుంబం వినియోగ వస్తువులపై పెట్టే ప్రతి రూ.10,000 ఖర్చుకు ప్రభుత్వానికి రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. అయితే పన్ను రేటు తగ్గించామని చెప్పి ఇందులో రూ.300 రూపాయలు వాపసు చేస్తే దానితో ఏం కొనగలం? బహుశా చిన్నారుల కోసం కొన్ని గుడ్లు కొనుగోలు చేయగలమేమో. అధిక జీతం పొందుతున్న వ్యక్తి రూ.10 లక్షలు పెట్టి కారు కొన్నాడని అనుకుందాం. జీఎస్టీ రేటును 28 శాతం నుండి 22 శాతానికి తగ్గిస్తే ఓ రూ.60,000 ఆదా అవుతాయి. కానీ దానితో అతను తన కుమార్తెకు ఓ ఐప్యాడ్ మాత్రమే కొనగలడు.
ఆదాయాలు పెరిగినప్పుడే…
‘పన్ను రేట్లను తగ్గిస్తే ప్రజల వినియోగం పెరుగుతుంది. ప్రజలపై మరిన్ని పన్నులు విధించడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. అప్పుడు వాటిపై మళ్లీ మినహాయింపులు…ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది’ అని ఓ ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు. అయితే ఆదాయాలు పెరిగినప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయన్న వాస్తవాన్ని పాలకులు విస్మరిస్తున్నారు. ‘రెవెన్యూ తటస్థ’ జీఎస్టీ రేటు 6.2-15.3 శాతం మధ్య ఉండాలని అనేక అధ్యయనాలు సూచించాయి. గరిష్ట రేటును 18 శాతం నుండి 15 శాతానికి, లగ్జరీ రేటును 28 శాతం నుండి 22 శాతానికి తగ్గిస్తే ప్రభుత్వం కోల్పోయే ఆదాయం ఏమీ ఉండదు. కానీ జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీనియర్ న్యాయవాది (ట్యాక్స్) అరవింద్ దతార్ చెప్పారు.