రైతుల ఆందోళనపై నిరంకుశ విధానాలను విడనాడాలి

Feb 13,2024 10:41 #Delhi, #Samyukta Kisan Morcha

 ఎస్‌కెఎం డిమాండ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పంజాబ్‌, ఢిల్లీ సరిహద్దుల్లోని హైవేలపై ఇనుప మేకులు, ముళ్ల తీగలు, కాంక్రీట్‌ బారికేడ్‌లు ఏర్పాటుచేసి ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న రైతుల ఆందోళనలపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణి పట్ల సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ, హర్యానా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించి ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్‌ను దారి మళ్లించి భయాందోళనకు గురిచేస్తోందని విమర్శించింది. నిరసనకారులను దేశ శత్రువులుగా మోడీ ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తింది. ఈ మేరకు సోమవారం ఎస్‌కెఎం ప్రకటన విడుదల చేసింది. ‘ఎఐకెఎస్‌ నేత రామ్‌ నారాయణ్‌ కురారియాతో సహా అతని భార్య, ఐద్వా నేత అంజనా కురారియా, కిసాన్‌ సంఘర్ష సమితి నాయకుడు ఆరాధనా భార్గవ, బికెయు (టికాయిత్‌) నేత అనిల్‌ యాదవ్‌, ఎన్‌ఎపిఎం నేత రాజ్‌కుమార్‌ సిన్హాలతో పాటు మధ్యప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్ర నాయకులు, ఎస్‌కెఎం నాయకులపై సిఆర్‌పిసి సెక్షన్‌ 151 కింద అరెస్టు చేసి జైలులో పెట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు’ అని తెలిపింది’ఫిబ్రవరి 13న ఢిల్లీ చలోకు తాము పిలుపునివ్వలేదని, ఈ ఆందోళనతో ఎస్‌కెఎంకు ఎలాంటి సంబంధం లేదని ఎస్‌కెఎం ముందే స్పష్టం చేసింది. అయితే, ఎస్‌కెఎం కాకుండా ఇతర సంఘాలకు నిరసన తెలిపే హక్కు ఉంది. మితిమీరిన రాజ్య అణచివేతకు పాల్పడానికి ఇటువంటి నిరసనలను ప్రజాస్వామ్య పద్ధతిలో చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది’ అని తెలిపింది. ‘ప్రజల జీవనోపాధి డిమాండ్లపై ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్‌, పారిశ్రామిక/ సెక్టోరల్‌ సమ్మె పిలుపు నేపథ్యంలో రైతులు, కార్మికుల వేదికలతో చర్చలకు ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదో ప్రధాని మోడీ స్పష్టం చేయాలి’ అని ఎస్‌కెఎం పేర్కొంది.’ప్రజల జీవనోపాధి డిమాండ్లపై దేశమంతటా జరుగుతున్న పోరాటాలను, ప్రజల ఆందోళనను అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించవు. పౌరులందరికీ నిరసన తెలిపే హక్కును కల్పించే రాజ్యాంగం దేశంలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌కు ఎస్‌కెఎం గుర్తు చేసింది. ఎస్‌కెఎం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని తరగతులకు చెందిన వర్గ, బహుజన సంఘాలు మోడీ పరిపాలన దురాక్రమణను ఖండించాలి’ అని విజ్ఞప్తి చేసింది. ‘బిజెపి హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న అణచివేతను ప్రజలు తిప్పికొట్టాలి. ప్రజల మద్దతుతో రైతులు, కార్మికులు ఫిబ్రవరి 16 పారిశ్రామిక/ సెక్టోరల్‌ సమ్మె, గ్రామీణ బంద్‌ను భారీగా, ఉత్సాహంగా, విజయవంతమయ్యేలా చేయాలి’ అని పిలుపునిచ్చింది.

➡️