- టిక్కెట్ ధరలు సామాన్యులకు అందుబాట్లోకి తేగలరా?
- పైవేట్ కంపెనీలు విమానాలు కొంటే ప్రభుత్వం విజయమా?
- రాజ్యసభలో నిలదీసిన సిపిఎం ఎంపి ఎఎ రహీం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో విమానయాన రంగం అదానీ, టాటా, ఇండిగో ముగ్గురు చేతుల్లోనే ఉందని సిపిఎం ఎంపి ఎఎ రహీం విమర్శించారు. గురువారం రాజ్యసభలో భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లుపై జరిగిన చర్చలో సిపిఎం ఎంపి రహీం ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ బిల్లు పేరునే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. భారతదేశం భాషా ప్రయుక్త రాష్ట్రాలతో కూడినదని మరిచిపోవద్దని హితవు పలికారు. ఈ బిల్లును ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లుగా మార్చాలని తాను కోరుతున్నానన్నారు. ఈ బిల్లును మనం ఎందుకు చర్చిస్తున్నాం? ఎందుకంటే భారత పౌర విమానయాన రంగ సంరక్షకులు ఎవరు? మంత్రా? లేక మంత్రిత్వ శాఖా? అని ప్రశ్నించారు. కానీ మంత్రి, మంత్రిత్వ శాఖ సంరక్షకులు కాదని అన్నారు. భారత పౌర విమానయాన రంగంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఏమీ లేదని అన్నారు. టాటా, ఇండిగో, అదానీ సంస్థలే మొత్తం విమానయాన రంగాన్ని నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని దాదాపు మేజర్ ఎయిర్‌పోర్టులన్నీ అదానీ చేతుల్లో ఉన్నాయని, ఆకాశంలో టాటా, ఇండిగోదే పైచేయి అని అన్నారు. కేంద్ర మంత్రి ఏమో మోడీ ప్రభుత్వ హయాంలోనే విమాన ప్రయాణికులు రెట్టింపయ్యారని గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పారు. కానీ విమాన ఛార్జీలు నియంత్రణ లేకుండా పెరుగుదలను మరిచారని అన్నారు. మంత్రి గారు మీరేమైనా విమాన టిక్కెట్టు ధరలను నియంత్రించగలరా? అని ప్రశ్నించారు. కంపెనీలు టిక్కెట్టు ధర ఎంత చెబితే అంతేనని అన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ 356 రిపోర్టు విమాన టిక్కెట్ల ధరలు నియంత్రించాలని, సామాన్యులకు అనుగుణంగా టిక్కెట్లు ధరలు ఉండాలని స్పష్టం చేసిందన్నారు. దేశంలో ఈ డిమాండ్ చాలా సుదీర్ఘ కాలంగా ఉందని గుర్తుచేశారు. యువ మంత్రిగా విమాన ఛార్జీలు రెగ్యులేట్ చేసేందుకు ఒక యంత్రాంగాన్ని తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. ‘మీరు తీసుకురాలేరు. ఎందుకంటే డిరెగ్యులేట్ అనేది నయా ఉదారవాద విధానాల ప్రాథమిక మంత్రమని’ విమర్శించారు. ఇండిగో, టాటా కొత్త విమానాలు కొనుగోలు చేస్తే, దాన్ని ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ రెండు సంస్థలు విమానాలు కొనుగోలు చేస్తే, ప్రభుత్వం బిల్లు ఎందుకు తీసుకొస్తుందని ప్రశ్నించారు.