ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ కొరతను నివారించండి: జైరాం రమేష్‌

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎయిమ్స్‌ ఆసుపత్రుల్లో ఫ్యాకల్టీ కొరత కలవరపెడుతోందని కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌లో ఖాళీలపై రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా దేశవ్యాప్తంగా ఎయిమ్స్‌ సంస్థల్లో అధ్యాపకుల ఖాళీల వివరాలను మంగళవారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపిందని పేర్కొన్నారు. ఆ గణాంకాలు కలవరపెడుతున్నాయని బుధవారం ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. అధ్యాపక ఖాళీలు ఎయిమ్స్‌ న్యూఢిల్లీలో 34 శాతం, బోపాల్‌లో 24 శాతం, భువనేశ్వర్‌లో 25 శాతం, జోద్‌పూర్‌లో 28 శాతం, రారుపూర్‌లో 38 శాతం, పాట్నాలో 27 శాతం, రిషికేశ్‌లో 39 శాతం ఉన్నాయని తెలిపారు.
మరో 12 నగరాల్లో పాక్షికంగా ఎయిమ్స్‌ సేవలందిస్తోందని పేర్కొన్నారు. మంగళగిరిలో 41 శాతం, నాగ్‌పూర్‌లో 23 శాతం, కల్యాణిలో 39 శాతం, గోరఖ్‌పూర్‌లో 37 శాతం, బటిండాలో 33 శాతం, బిలాస్‌పూర్‌ (హెచ్‌పి)లో 54 శాతం, గౌహతిలో 43 శాతం, దేవ్‌గఢ్‌లో 34 శాతం, బిబి నగర్‌ (తెలంగాణ)లో 36 శాతం, రారుబరేలిలో 49 శాతం, రాజ్‌కోట్‌లో 59.5 శాతం, జమ్ములో 44 శాతం అధ్యాపకుల కొరత ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రమాణాలు నీరుగారకుండా చర్యలు తీసుకోవాలని, అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని ఆయన కోరారు. జైరాం రమేష్‌ పోస్ట్‌పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ స్పందించింది. ఎయిమ్స్‌ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించింది.

➡️