గుజరాత్‌లో ఘోరం – 27 మంది సజీవదహనం

May 26,2024 08:03 #fire acident, #Gujarat
  • రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం
  •  27 మంది సజీవదహనం
  •  వీరిలో 12 మంది చిన్నారులు
  •  మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం

రాజ్‌కోట్‌ : గుజరాత్‌లో ఘోరం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో వినోదం కోసం క్రీడా ప్రాంగణానికి వెళ్లిన చిన్నారులు, వారి సంబంధికుల్లో 27 మంది అక్కడ సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల్లో అంతులేని వేధన అనుభవిస్తున్నారు. మాటలకందని ఈ విషాద ఘటన రాజ్‌కోట్‌ నగరంలో శనివారం సాయంత్రం ఒక గేమ్‌ జోన్‌లో సంభవించింది. మరణించినవారిలో 12 మంది చిన్నారులున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్న వీడియోలు శనివారం సాయంత్రం మీడియాకు విడుదలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..టిఆర్‌పి గేమ్‌ జోన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక నిర్మాణంలో ఈ మంటలు చెలరేగాయి. ప్రస్తుతం వేసవి శలవులు కావడంతో అక్కడ ఆడుకోవడానికి పెద్ద సంఖ్యలో పిల్లలు వచ్చారు. అదే సమయంలో ప్రమాదం జరగడంతో బాధితుల్లో అత్యధిక మంది చిన్నారులే ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి 20 మంది మృత దేహాలను వెలికితీసినట్లు రాజ్‌కోట్‌ పోలీసు కమిషనర్‌ రాజు భార్గవ తెలిపారు. ఈ విషాద ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి భూపిందర్‌ పటేల్‌ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారాన్ని అందచేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందచేయనున్నట్లు చెప్పారు. తక్షణమే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని ఆయన ట్వీట్‌ చేశారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను తలచుకుంటే తన మనస్సు కలత చెందుతోంద న్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలన్నారు. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

➡️