శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ (జెకెఐఎం)పై ఐదేళ్ల పాటు కేంద్ర హోం శాఖ నిషేధం విధించింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో దానిపై ఐదేళ్ల పాటు తక్షణ నిషేధం విధిస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) మంగళవారం ప్రకటించింది. 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
మస్రూర్ అబ్బాస్ అన్సారీ నాయకత్వంలోని జెకెఐఎం జమ్మూకాశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడానికి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు దేశ వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆసంస్థ మరియు దాని సభ్యులు ఈ ప్రాంతంలో వేర్పాటువాద మరియు ఉగ్రవాద కార్యకలాపాలతో సహా చట్టవిరుద్ధమైన చర్యల కోసం నిధులు సేకరిస్తున్నారని ఆరోపించింది.