ఉదయ్ పూర్‌ పాఠశాలలో కత్తిపోట్ల ఘటనతో మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం

జైపూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌ పట్టణంలో ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగిన కత్తిపోట్ల ఘటన మత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉదయ్ పూర్‌ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 24 గంటల పాటు మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మూసివేయాలని కలెక్టర్‌ అరవింద్‌ పోస్వాల్‌ ఆదేశించారు. వదంతులను పట్టించుకోవద్దని కలెక్టర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని భట్టియాని చోహట్టా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల వెలుపల పదవ తరగతి విద్యార్థి మరొక బాలుడిని కత్తితో పొడిచాడు. ఈ దాడిలో గాయపడిన విద్యార్థి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు నిర్బంధంలో ఉన్నాడు. వారిద్దరూ మైనర్లని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత నుంచి ఉదయ్ పూర్‌ పట్టణంలోని బాపూ బజార్‌, హతిపోల్‌, ఘంటా ఘర్‌, చేతక్‌ సర్కిల్‌ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాలకు నిప్పుపెట్టడం, రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు జరిగాయి. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరంలో అదనపు పోలీసులను మోహరించారు.

➡️