‘వక్ఫ్‌’ నిరసనలపై లాఠీ

  • అస్సాంలో పలువురికి గాయాలు
  • బెంగాల్‌ ముర్షీదాబాద్‌లో మరో 12 మంది, మధ్యప్రదేశ్‌లో తొమ్మిదిమంది అరెస్టు

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన వక్ఫ్‌ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. అస్సాంలో తాజాగా జరిగిన నిరసనపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
వక్ఫ్‌ (సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ అస్సాంలోని కాచర్‌ జిల్లా సిల్చార్‌ పట్టణంలో ఆదివారం భారీర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో తాజా చట్టాన్ని రద్దు చేయాలంటూ నల్ల జెండాలు పట్టుకుని వందలాదిమంది నిరసన తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ పోలీసులు ర్యాలీని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తరువాత లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం విలేకరులతో మాట్లాడుతూ వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి ఆందోళననైనా పోలీసులు అణచివేస్తారని చెప్పారు.

ముర్షీదాబాద్‌లో మరో 12 మంది అరెస్టు

పశ్చిమ బెంగాల్‌ ముర్షీదాబాద్‌ జిల్లాలో వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసులో మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టులు 150కి పెరిగినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. హింసాకాండ ప్రభావిత ప్రాంతాల్లో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌) సెక్షన్‌ 163 కింద నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్‌ను నిలిపివేశామని చెప్పారు.

మరో ఐదు కంపెనీల బలగాల తరలింపు
ముర్షిదాబాద్‌కు మరో ఐదు కంపెనీల బలగాలను తరలించినట్లు సరిహద్దు

భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) ఆదివారం వెల్లడించింది. జిల్లాలో పరిస్థితిని నియంత్రించడానికి శనివారం వరకూ నాలుగు కంపెనీలను మోహరించామని, ఇప్పుడు అదనంగా మరో ఐదు కంపెనీలను తరలించామని బిఎస్‌ఎఫ్‌ డిఐజి, పిఆర్‌ఓ (పశ్చిమబెంగాల్‌ ఫ్రాంటియర్‌) నీలోత్పల్‌ కుమార్‌ పాండే మీడియాకు తెలిపారు.

మధ్యప్రదేశ్‌ మతఘర్షణల కేసులో తొమ్మిదిమంది అరెస్టు

మధ్యప్రదేశ్‌లోని గుణలో శనివారం జరిగిన మత ఘర్షణలకు సంబంధించిన కేసులో కాంగ్రెస్‌కు చెందిన వికీ పాంథన్‌ సహా తొమ్మిదిమందిని అరెస్టు చేసినట్లు గుణ అదనపు ఎస్‌పి ఆదివారం తెలిపారు. గుణలోని కల్నల్‌గంజ్‌ ప్రాంతంలో శనివారం రాత్రి హనుమాన్‌ జయంతి సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. మసీదు మీదుగా ఊరేగింపు వెళ్తున్నప్పుడు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో మసీదు వద్ద ఉన్న వారు కూడా నినాదాలు చేయడంతో జరిగిన వాగ్వివాదం ఘర్షణలకు దారితీశాయి. 13 మంది గాయపడ్డారు. హిందూ సొసైటీ ఫిర్యాదు మేరకు 25 మందిపై కేసు నమోదు చేశామని, వారిలో తొమ్మిదిమందిని అరెస్టు చేశామని తెలిపారు. ఊరేగింపు కోసం ఎటువంటి అనుమతి తీసుకోలేదని చెప్పారు.

➡️