రమాల్‌తో బెంగాల్‌ అతలాకుతలం

May 29,2024 08:56 #at odds, #Bengal, #Ramal
  • రంగంలోకి రెడ్‌ వాలంటీర్లు
  • ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు

కోల్‌కతా : రేమాల్‌తో అతలాకుతలమైన పశ్చిమ బెంగాల్‌లో రెడ్‌ వాలంటీర్లు రంగంలోకి దిగారు. సహాయక, పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు. కోవిడ్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గన్న రెడ్‌ వాలంటీర్లు ప్రస్తుత తుపాను సమయంలోనూ తమదైన శైలిలో సేవలందిస్తున్నారు. ప్రజలను కాపాడుతున్నారు. తమ ట్రేడ్‌ మార్క్‌ రెడ్‌ టీ షర్టులు ధరించి బైక్‌లు, సైకిళ్లపై ప్రయాణిస్తూ సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నప్పటికీ, రెడ్‌ వాలంటీర్లు తుపాను బాధితులను రక్షించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెడ్‌ వాలంటీర్లల్లో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సిపిఎం నుంచి పోటీచేస్తున్న యువ అభ్యర్థులు కూడా ఉండటం విశేషం. డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రతికూర్‌ రెహ్మాన్‌, మధురాపూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న శరత్‌చంద్ర హల్దార్‌ తదితరులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గంటున్నారు. కోల్‌కతాలో మెటియాబురుజ్‌ ప్రాంతంలోని బాధితులను సహాయక కేంద్రాలకు తీసుకెళ్లడంలో రెడ్‌ వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. బషీర్‌హాత్‌ ప్రాంతంలో సిపిఎం అభ్యర్థి నిరపాద సర్దార్‌ రెడ్‌ వాలంటీర్ల బృందంతో కలిసి తాగునీటికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీటిలో మునిగిపోయిన గొట్టపు బావులను బాగు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సుందర్‌బన్స్‌లోని రైడిఘి ప్రాంతంలో వామపక్ష నాయకులు కాంతి గంగూలీ సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తున్నారు. తూర్పు మేదినీపూర్‌ జిల్లా, నందిగ్రామ్‌, ఇతర తీర ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటి కొరత సమస్య ఎక్కువగా ఉంది. దీనిని తీర్చడానికి రెడ్‌వాలంటీర్లు నడుం బిగిస్తున్నారు. కోవిడ్‌-19 కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు కొట్టుమిట్టాడుతున్న సమయంలో సుమారు ఎనిమిది వేల మంది వామపక్ష భావాలు గల విద్యార్థులు, యువతతో రెడ్‌ వాలంటీర్ల బృందం ఏర్పడింది.

బెంగాల్‌లో ఆరుగురు మృతి : 15 వేలకు పైగా ఇళ్ల ధ్వంసం
రేమాల్‌ తుపాను బెంగాల్‌లో అతలాకుతలం సృష్టించింది. ఆరుగురు మరణించగా, 15 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వెయ్యి ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, మిగిలిన ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,400 చెట్లు నేలకూలాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్డు రవాణా స్థంభించింది. దాదాపు 337 విద్యుత్‌ స్థంభాలు నేలమట్టం కావడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తుపానుకు కక్‌ద్వీప్‌, నమ్‌ఖానా సాగర్‌ దీవులు, డైమండ్‌ హార్బర్‌, ఫ్రేసర్‌గంజ్‌, బక్కహలి, హింగల్‌హంగ్‌, మందర్మోని బ్లాక్‌లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. సుందర్‌బన్స్‌లోని సుమారు 410 ప్రాంతాల్లో నది కట్టలు తెగిపోవడంతో జనావాస భూములు, పంట భూములు ముంపునకు గురయ్యాయి.

➡️