మంకీపాక్స్‌తో జాగ్రత్త !

Aug 21,2024 00:14 #Monkeypox, #WHO

న్యూఢిల్లీ : మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) అంటు వ్యాధిగా గుర్తించడం, ఆఫ్రికా, ఐరోపాలో ఇది వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మన దేశం అప్రమత్తమైంది. ఎంపాక్స్‌ లక్షణాలతో బాధపడే వారు దేశంలోకి రాకుండా నిరోధించేందుకు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లతో గల సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్‌ను ఎదుర్కోడానికి తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధత, సంబంధిత ప్రజారోగ్య చర్యలను సమీక్షించేందుకు ప్రధాని మోడీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పి.కె.మిశ్రా అధ్యక్షతన ఆదివారం ఇక్కడ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. డబ్ల్యు హెచ్‌ఓ గతంలో ఇచ్చిన డేటా ప్రకారం 116 దేశాల్లో 2022 నుండి మంకీపాక్స్‌ కేసులు 99,176 నమోదయ్యాయి. 208మంది మరణించారు. భారత్‌లో ఈ కేసులు 30వరకు నమోదయ్యాయి. చివరి కేసు ఈ ఏడాది మార్చిలో నమోదైంది. ఎంపాక్స్‌ లక్షణాలు ఉన్న రోగుల కోసం ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ ఆస్పత్రి, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో, ఓడరేవుల్లో దీని గురించి తెలియచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంకీ పాక్స్‌ లక్షణాల గురించి ప్రజల్లో చైతన్యం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.

➡️