భానుడు భగభగ

Apr 30,2024 08:56 #Heatwave, #sun
  • మూడో విడత ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం : నిపుణులు
  •  రానున్న ఐదు రోజులు పలు రాష్ట్రాల్లో వేడిగాలులు :ఐఎండి

న్యూఢిల్లీ: దేశంలో మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్నది. ఇలాంటి తరుణంలో రానున్న ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. కీలక ఎన్నికల వేళ అధిక ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు చేసే పోల్‌ ప్రచారాలలో వేలాది మంది ప్రజలు ఈ తీవ్ర ఎండల్లోనే పాల్గొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సామాజికవేత్తలు అంటున్నారు. మే 7న ఓటింగ్‌ జరిగే అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, కర్నాటక, కేరళ, గోవా, తూర్పు యూపీలలో వేడిగాలులు ఉండే అవకాశం ఉన్నందున, మూడో దశ ఎన్నికలలో పాల్గొనటానికి భారతీయ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్‌ స్టేషన్‌ సిబ్బందిని సురక్షితంగా ఉంచేందుకు పార్టీలు, అధికారులు మరింత కృషి చేయాలని ఎన్నికల సంఘం (ఇసి) కోరింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు వడదెబ్బ గురయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. సోలౌర్‌లో అత్యధికంగా 43.7 డిగ్రీల సెల్సియస్‌ ఉన్నది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో మండుతున్న వేడిగాలులు రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు భయంకరమైన స్థాయికి పెరుగుతాయని అంచనా. కేరళలోని కొల్లం, త్రిసూర్‌, పాలక్కాడ్‌లలోనూ ఐఎండి హీట్‌ వేవ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఈరోజు చాలా చోట్ల హీట్‌ వేవ్‌ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మూడో విడత పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రజలు లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. తలపై టోపీ లేదా గుడ్డ కప్పుకోవాలి. ఎండలో ఎక్కువగా ఉండకూడదు. ”ఎల్లప్పుడూ పుష్కలంగా ద్రవపదార్థాలు, నీటిని తీసుకోవాలి. రోజువారీ సూచనలతో పాటు భారత వాతావరణ శాఖ సలహాలను గమనించాలి, పాటించాలి” అని భారత వాతావరణ శాఖ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ తెలిపారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలనీ, పాలనా యంత్రాంగాలు ఎండల విషయంలో సీరియస్‌గా దృష్టిని సారించి తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

➡️