ఇడి నుంచి నా కుమారుడికి సమన్లు అందలేదు : భూపేష్‌ బాఘేల్‌

రాయ్ పూర్‌ : లిక్కర్‌ స్కామ్‌లో లింక్‌ ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తన కుమారుడికి ఇడి నుంచి ఎలాంటి సమన్లు అందలేదని ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ వ్యాఖ్యానించారు. మీడియా హైప్‌ కోసమే ఇడి ఇలాంటివి సృష్టించిందని భూపేష్‌ తీవ్రంగా విమర్శించారు. శనివారం బాఘేల్‌ కుమారుడు శ్రీచైతన్య లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇడి ఎదుట హాజరవ్వనున్నారా? అని భిలారులోని బాఘేల్‌ నివాసం వెలుపల మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించారు. ‘శ్రీచైతన్యకు ఇడి నుంచి ఎలాంటి సమన్లు అందలేదు. ఒకవేళ సమన్లు అందితే.. కచ్చితంగా హాజరవుతారు. ఇడి ఆదేశాలను పాటిస్తాము. మీడియాలో హైప్‌ని సృష్టించడానికి ఇడి చేసిన పని. అప్రతిష్టపాలు చేయడానికి బిజెపి నేతలు ఇడిని ఉపయోగిస్తున్నారు. నాపై ఏడు సంవత్సరాలుగా ఒక సిడి కేసు ఉంది. ఇటీవలే కోర్టు నాపై ఉన్న ఆరోపణల్ని కొట్టివేసింది. ఒక రాజకీయ నాయకుడిని అప్రతిష్టపాలు చేయడానికి బిజెపి చేసిన కుట్ర ఇది’ అని ఆయన అన్నారు.
కాగా, భూపేష్‌ బాఘేల్‌ సిఎంగా ఉన్న సమయంలో లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని.. దాదాపు 2,100 కోట్ల రూపాయలు ఖజానాకు నష్టం వాటిల్లిందని ఇడి పేర్కొంది.

➡️