ఇంఫాల్ : బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన ఘనత గాంధీజీది. నేడు దేశవ్యాప్తంగా గాంధీజీ 155వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో కుకీ, మెయిటీ జాతుల మధ్య ఏడాదికిపైగా కొనసాగుతున్న హింసకు తెరపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. బుధవారం మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాజకీయ చర్చల్లో అన్ని సంఘాలు పాల్గొనాలని కోరారు. బీరెన్‌సింగ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు నేడు ఇంఫాల్‌లో ఉన్న గాంధీజీ హాల్‌లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీరెన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేడు గాంధీజీ జయంతి. అలాగే జాతీయ పరిశుభ్రత దినోత్సవం. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సత్యం, అహింస, పరిశుభ్రత స్ఫూర్తిని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం అహింసను నమ్ముదాం. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాజకీయ చర్చలు జరుపుతున్నాం’ అని ఆయన అన్నారు.
కాగా, మణిపూర్‌లో గతేడాది మే 3వ తేదీన మెయిటీలు, కుకీల మధ్య చెలరేగిన హింస ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జాతుల ఘర్షణల వల్ల ఎంతోమంది చనిపోయారు. అయినప్పటికీ దేశ ప్రధాని మోడీ ఇప్పటివరకు స్పందించకపోవడం, ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడం గమనార్హం.