మహారాష్ట్రలో ‘ఇండియా’ విచ్ఛిన్నానికి బిజెపి కుట్ర!

Jun 12,2024 09:09 #BJP, #Conspiracy, #India, #Maharashtra

ఉద్దవ్‌ థాకరేకు ప్రశంసలు
ముంబయి : తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్‌డిఎ కూటమి ఘోర పరాభావాన్ని చవిచూసింది. ఎన్‌డిఎలోని శివసేన (ఏక్‌నాథ్‌ షిండే గ్రూపు), ఎన్‌సిపి (అజిత్‌ పవార్‌ గ్రూపు) పార్టీలు ఎంతమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అసలైన శివసేన, ఎన్‌సిపిలను చీల్చి బిజెపి ఈ గ్రూపులను తనవైపునకు తిప్పుకున్న సంగతి తెలిసిందే. ఇండియా వేదికలోని శివసేన (ఉద్ధవ్‌ థాకరే గ్రూపు), ఎన్‌సిపి (శరద్‌ పవార్‌ గ్రూపు)లకు ప్రజల ఆదరణ లభించడంతో బిజెపిలో ఆందోళన పెరుగుతోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా వేదికలోని కాంగ్రెస్‌కు 13 స్థానాలు లభించగా, శివసేన (ఉద్ధవ్‌ థాకరే గ్రూపు) 9, ఎన్‌సిపి (శరద్‌ పవార్‌ గ్రూపు) 8 స్థానాల్లోనూ విజయం సాధించాయి.
ఈ ఏడాదిలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోగానే ఇండియా వేదిక పార్టీలను చీల్చాలని బిజెపి భావిస్తోంది. అందుకోసం ఉద్ధవ్‌ థాకరేపై ప్రశంసలు కురిపిస్తూ, తమవైపునకు తిప్పుకోవాలని అనుకుంటోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉద్థవ్‌ కష్టపడి పనిచేయడం వల్లే ఇండియా వేదిక లాభపడిందని బిజెపి నాయకుడు చంద్రకాంత్‌ పాటిల్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. ఉద్థవ్‌ థాకరే కష్టంతో కాంగ్రెస్‌, ఎన్‌సిపిలు లాభపడ్డాయని చెప్పారు. ఈ ప్రశంసలను ఉద్థవ్‌ థాకరే పట్టించుకోరని శివసేన కార్యకర్తలు అంటున్నారు. ఏక్‌నాథ్‌ షిండే ద్వారా శివసేనను బిజెపి చీల్చడంతో ఉద్ధవ్‌ థాకరే తన ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

➡️