ఓటమి భయంతోనే బిజెపి గూండాయిజం : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం తమదేనని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆప్‌ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తుండగా.. బిజెపి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయిందని విమర్శించారు. ఓటమి భయంతో బిజెపి నాయకులు గూండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఆప్‌ నాయకులపై, ప్రజలపై దాడులు చేస్తున్న బిజెపి గూండాలపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఢిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని కేజ్రీవాల్‌ అన్నారు. బిజెపి గూండాయిజానికి వ్యతిరేకంగా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బిజెపి లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా, వేధింపులకు గురిచేసినా ఈ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్‌ కోరారు.
ఇలాంటి ఘటన తమ దృష్టికి వచ్చినా సరే, ‘అమిత్‌ షా గుండాగిరి హ్యాష్‌ట్యాగ్‌’ను వాడి తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కేజ్రీవాల్‌ సూచించారు. బిజెపి మనలను భయపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం బెదరవద్దని సూచించారు. అలాగే ఎన్నికలకు ముందు మురికివాడల్లో నివసించే, ఆర్థికంగా బలహీనులైన వారి ఓటు హక్కును తొలగించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

➡️