బిజెపిదే బాధ్యత

  • సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి
  • సంభాల్‌లో హిందు – ముస్లిం ఘర్షణలపై రాహుల్‌గాంధీ
  • 30 వరకూ ఆంక్షలు విధించిన జిల్లా యంత్రాంగం

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింసాత్మక పరిస్థితులపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి హిందూ, ముస్లింల మధ్య బిజెపి సృష్టిస్తున్న గొడవ దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని పేర్కొన్నారు. సంభాల్‌ ఘర్షణ, మరణాలకు దారితీసిన వ్యవహారంలో బిజెపి నేరుగా బాధ్యత వహించాలని వివరించారు. ఈ విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం సంభాల్‌లోని మొఘల్‌ కాలం నాటి జామా మసీదును రెండోసారి సర్వే నిర్వహించటానికి అధికార బృందం రాగా.. స్థానికులు వ్యతిరేకత తెలపటంతో పోలీసులు భాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు ముస్లిం వ్యక్తులు చనిపోగా, పలువురికి గాయాలైన విషయం విదితమే. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా రాహుల్‌గాంధీ స్పందించారు. ”యుపిలోని సంభాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న వివాదంలో రాష్ట్రప్రభుత్వ పక్షపాత, తొందరపాటు వైఖరి చాలా దురదృష్టకరం. హింసలో, కాల్పుల్లో తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అన్ని పార్టీలను సంప్రదించకుండా పాలకవర్గం తీసుకున్న చర్య అక్కడి వాతావరణాన్ని చెడగొట్టి, ప్రజల మరణాలకు దారి తీసిందని రాహుల్‌ పేర్కొన్నారు. దీనికి బిజెపి బాధ్యత వహించాలని వివరించారు. శాంతికి, పరస్పర సామరస్యానికి ఆయన పిలుపునిచ్చారు. మనమంతా కలిసి.. ఐక్యత, రాజ్యాంగం అనే మార్గంపై భారత్‌ ముందుకెళ్లేలా చూడాలనీ, మతతత్వం, విద్వేషం పైన కాదని రాహుల్‌ నొక్కి చెప్పారు.
ఆంక్షలు విధించిన జిల్లా యంత్రాంగం
ఆదివారం సంభాల్‌లో చోటుచేసుకున్న ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అక్కడ నిషేదాజ్ఞలు విధించింది. బయటివారెవరూ ఇక్కడకు రాకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు ఈనెల 30 వరకు అమలులో ఉండనున్నాయి. సంభాల్‌లో 24 గంటల పాటు అధికారులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. జిల్లా యంత్రాంగం సోమవారం అన్ని పాఠశాలలకూ సెలవు ప్రకటించింది.

➡️