బిజెపి నయవంచనకు పరాకాష్ట

Feb 11,2024 10:33 #BJP, #height, #hypocrisy
  • చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌ల ఆశయాల అమలేది ?
  • కనీస మద్దతు ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోడీ సర్కార్‌
  • అశయాలు నెరవేర్చకుండా అవార్డులివ్వడమంటే అవహేళన చేయడమే
  • ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం విమర్శ

న్యూఢిల్లీ : చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు భారత రత్న ప్రకటించడం బిజెపి ప్రభుత్వ నయ వంచనకు పరాకాష్ట అని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌), సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)లు విమర్శించాయి. వారి ఆశయాలకు సమాధి కడుతూ, ఇప్పుడు వారికి అవార్డులు ప్రకటించారని, ఇది హేళన చేయడమేనని విమర్శించాయి. గత పదేళ్ళుగా ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను కప్పి పుచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మోడీ ప్రభుత్వంపై ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలె ఒక ప్రకటన జారీ చేశారు.

మోడీ ప్రభుత్వ పాలనలో 2020-21లో మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగం ఏడాది పొడవునా సాగించిన పోరాటం సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో 750 మందికి పైగా రైతులు అమరులయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ ప్రకటన పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చినా ఇప్పటికీ అందులోని చాలా కుటుంబాల వారికి ఎలాంటి నష్టపరిహారం దక్కలేదని అన్నారు. ఫ్యూడల్‌ వ్యతిరేక రైతు నేతగా అందరికీ చిరపరిచితులైన చౌదరి చరణ్‌ సింగ్‌ స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖెరీలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు హత్యకు కేంద్ర మంత్రి అజరు మిశ్రా తేని ప్రత్యక్షంగా బాధ్యులైనా దాని గురించి పట్టించుకోకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గు పడాల్సిన విషయమని విమర్శించారు. అంతకన్నా అధ్వాన్నమైన విషయమేమంటే, హత్య చేసినందుకు జైలు కెళ్ళాల్సిన ఆ మంత్రి ఇంకా మోడీ కేబినెట్‌లో వున్నారని అన్నారు. గత పదేళ్ళ మోడీ పాలనలోనే లక్ష మందికి పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్‌సిఆర్‌బి డేటా ద్వారా వెల్లడవుతోంది. సమగ్ర ఉత్పత్తి వ్యయం సి2 ప్లస్‌ 50 శాతానికి ఒకటిన్నర రెట్లు చొప్పున కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలంటూ డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ రైతాంగ కమిషన్‌ (ఎన్‌సిఎఫ్‌) చేసిన అత్యంత ముఖ్యమైన సిఫార్సును అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే ఇంతటి మానవ విషాదానికి ప్రధాన కారణంగా వుంది.

50శాతం నికర లాభానికి హామీ కల్పించడం ద్వారా వ్యవసాయంలో లాభదాయకతను పెంచుతామంటూ 2014 ఎన్నికల ప్రణాళికలో బిజెపి హామీ ఇచ్చింది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో 400కి పైగా సభల్లో మోడీ ఇదే హామీ ఇచ్చారు. కానీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేసిందేమిటి? ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతుధరగా ఉపకరణాల వ్యయం ప్లస్‌ 50శాతం ఇవ్వాలంటే సాధ్యపడదని 2015 ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ అందచేసింది. దీనివల్ల మార్కెట్‌ అతలాకుతలమవుతుందని పేర్కొంది. అప్పటి నుండి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల్లో వేటినీ అమలు చేయడానికి తిరస్కరిస్తూనే వుందని ఆ ప్రకటన విమర్శించింది.

రైతు రుణాలను రద్దు చేస్తామంటూ ఆనాడు ఎన్నికల హామీ ఇచ్చారు, కానీ ఈ పదేళ్ళలో ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదన్నారు. కానీ మరోపక్క తన ఆశ్రితులైన కార్పొరేట్లకు చెందిన 15లక్షల కోట్ల రూపాయిల రుణాలను మాత్రం రద్దు చేశారని రైతు నేతలు విమర్శించారు. చరణ్‌ సింగ్‌, స్వామినాథన్‌లు తమ జీవితాంతం చేసిన కృషికి, ఆలోచనా ధోరణికి పూర్తి విరుద్ధంగా ఈనాడు మోడీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పంథా కొనసాగుతోందని ఎఐకెఎస్‌, ఎస్‌కెఎం విమర్శించాయి. ఇప్పటికే ఈ పంథా, వైఖరి భారత వ్యవసాయ రంగం, రైతాంగం నాశనమవడానికి దారి తీశాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త బూటకపు విధానాన్ని, నయ వంచనను రైతాంగం తెలుసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా తమ ఆగ్రహాన్ని ప్రదర్శించాలని ఆ ప్రకటన పిలుపిచ్చింది. ఈ నెల 16న జరగబోయే పారిశ్రమిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని కోరింది.

➡️