రాంచీ : జార్ఖండ్‌లో ఖనిజ సంపదను దోచుకునేందుకు బిజెపి కుట్ర చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. మంగళవారం మండులో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. గిరిజన ముఖ్యమంత్రి నుండి అధికారాన్ని లాక్కోవాలని కాషాయమూకలు యత్నిస్తున్నాయని, అందుకే రాష్ట్రంలో పోటీచేస్తున్న అభ్యర్థుల కంటే ఎక్కువమంది ఇతర ప్రాంతాల బిజెపి నేతలే అక్కడ పర్యటిస్తున్నారని అన్నారు. జార్ఖండ్‌లో నల్లబంగారం (బొగ్గు)పై బిజెపి కన్ను పడిందని, దాన్ని దోచుకునేందుకు చూస్తోందని తెలిపారు. ప్రజల బాగోగుల కంటే బొగ్గు దోపిడీపైనే బిజెపి నేతల దృష్టి ఉందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత ప్రయత్నించినా హేమంత్ సోరెన్‌ను తొలగించే సాహసం ఎవరూ చేయలేరని అన్నారు.
ఇటీవల ప్రధాని చెబుతున్న అబద్ధాలకు అంతే లేకుండా పోతోందని, ఆయన అబద్ధాలకు అధిపతి అని విమర్శించారు. యువతకు ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట ఇంతవరకు నిలబెట్టుకోలేదని అన్నారు. బిజెపి ధనవంతుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని, ఐదు శాతం మంది ధనవంతులు దేశ సంపదలో 60 శాతం కలిగి ఉండగా, 50 శాతం మంది పేదలు మూడు శాతం సంపద మాత్రమే కలిగి ఉన్నారని అన్నారు. ధనవంతులకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ పేదలు, రైతులు, దళితులకు ఎటువంటి మాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేసే బిజెపికి కేంద్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదని, జార్ఖండ్ ప్రజలకు చెల్లించాల్సిన వేలకోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఖర్గే డిమాండు చేశారు.
81 స్థానాలు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 23న ఫలితాలు ప్రకటించనున్నారు.