అలీఘర్ : టార్పాలిన్‌తో హిజాబ్‌లను వేసుకోండి అని కేంద్ర మంత్రి రఘురాజ్ సింగ్ మంగళవారం ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హోలీ వేడుకల కారణంగా అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ముస్లింలు టార్పాలిన్‌తో చేసిన హిజాబ్‌లు ధరించాలని వ్యాఖ్యానించారు. కాకతాళీయంగా ఈ ఏడాది హోలీ పండుగ రంజాన్ నెలలోని రెండవ శుక్రవారం నాడే వచ్చింది. హోలీ వేడుకలు, జుమా నమాజ్ (ఫ్రైడే ప్రేయర్స్ ) యుపి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, కానీ కొంతమంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారని కేంద్ర కార్మీక మరియు ఉపాధి మంత్రి రఘురాజ్ సింగ్ పేర్కొన్నారు.
అక్కడి మహిళలు (ముస్లిం మహిళలకు సూచిస్తున్నట్లుగా) హిజాబ్ ధరించాలని, మసీదులను టార్పాలిన్‌తో కప్పాలని, ముస్లిం పురుషులు టార్పాలిన్‌తో హిజాబ్‌లు తయారు చేసుకుని, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లవచ్చని అన్నారు. అప్పుడు అసౌకర్యం ఉండదని, సులభంగా నమాజ్ చేయవచ్చని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ‘సనాతన ధర్మం’లో హోలీ విశ్వాసంతో కూడిన వేడుకని, ఉత్సవంలో పాల్గొనేవారిని నిర్దిష్ట పరిధిలోనే రంగులు చల్లుకోవాలని చెప్పలేమని అన్నారు.
యుపిలోని సంభాల్ ఎస్‌పి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ వివాదం ప్రారంభమైంది. హోలీ వేడుక ఏడాదికి ఒక్కసారే మాత్రమే వస్తుందని, జుమా నమాజ్ సంవత్సరానికి 52 సార్లు నిర్వహిస్తారని, హోలీ రంగులను అసౌకర్యంగా భావించేవారు ఇళ్లలోనే ఉండాలని సంభాల్ ఎస్‌పి అనుచిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్ధించడం గమనార్హం. హోలీ వేడుకల కారణంగా ఇప్పటికే యుపిలోని పలు మసీదులు నమాజ్ సమయాలను మార్చుకున్నాయి.
హోలీ రోజున మసీదులు జుమా నమాజ్‌ను మధ్యాహ్నం 2.00 గంటలకు నిర్వహించాలని లక్నోలోని ఈద్గా ఇమామ్ సూచించారు. ముస్లింలు సమీపంలో ఉన్న మసీదుల్లో నమాజ్ చేయాలని, దూరంగా ఉన్న మసీదులకు వెళ్లవద్దని సూచించారు.