న్యూఢిల్లీ : భారత రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ నిర్మాత అయిన డా.బి.ఆర్ అంబేద్కర్‌ను బిజెపి నేతలు పదేపదే అవమానిస్తూనే ఉన్నారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్‌ని అవమానించిన సంగతి తెలిసిందే. ఇటీవల పంజాబ్ అమృత్‌సర్ అంబద్కేర్ విగ్రహాన్ని విధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల అగౌరవం పెరుగుతోందని ఈ ఘటనలే రుజువు చేస్తున్నాయి. దీనిపై సభలో చర్చించేందుకు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి రణదీప్ సింగ్ సూర్జేవాలా సోమవారం మోషన్ నోటీసును సమర్పించారు. ప్రధానంగా ఈ విషయంపైనే సభలో చర్చించాలని, మిగతా అంశాలను జాబితా నుంచి తొలగించాలని ఆయన పంపిన నోటీసులో స్పష్టం చేశారు. తాను రాష్ట్రాల కౌన్సిల్ (రాజ్యసభ)లో విధివిధానాలు, ప్రవర్తన రూల్ 267 కింద నోటీస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో కాకుండా ఈ విషయంపై ప్రత్యేక చర్చ నడిపేందుకు ఈ రూల్ ఉపయోగపడుతుందని అందుకే ఈ రూల్ కింద నోటీసు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
