బిజెపికే మొగ్గు

Feb 6,2025 00:02 #Delhi election, #exit polls, #Results
  • ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందుతుందని కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం నిర్వహించగా, వీటి ఫలితాలు ఈ నెల 8న ప్రకటించనున్నారు. బుధవారం సాయంత్రం పలు సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేశాయి. ఇందులో ఎక్కువ ఎగ్జిట్‌ పోల్స్‌ స్వల్ప తేడాతో బిజెపి విజయం సాధిస్తుందని వెల్లడించాయి. పీపుల్స్‌ పల్స్‌ బిజెపికి 51 నుంచి 60 సీట్లు, ఆప్‌కు 10 నుంచి 19 సీట్లు వస్తాయని తెలిపింది. పీపుల్స్‌ ఇన్‌సైట్‌ బిజెపికి 40 నుంచి 44, ఆప్‌కి 25 నుంచి 29 సీట్లు వస్తాయని తెలిపింది. పి-మార్క్‌ బిజెపికి 39 నుంచి 49, ఆప్‌కు 21 నుంచి 31 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జెవిసి ఎగ్జిట్‌ పోల్‌ బిజెపికి 39 నుంచి 45, ఆప్‌కు 22 నుంచి 31 సీట్లు వస్తాయని తెలిపింది. చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌ బిజెపికి 39 నుంచి 44, ఆప్‌కు 25 నుంచి 28 సీట్లు వస్తాయని తెలిపింది.

ఆప్‌ గెలుస్తుందని రెండు సంస్థల అంచనా

రెండు సంస్థలు ఈ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధిస్తాయని అంచనా వేశాయి. వీ ప్రెసిడే ఆప్‌కు 46 నుంచి 52 సీట్లు, బిజెపికి 18 నుంచి 23 సీట్లు వస్తాయని తెలిపింది. మైండ్‌ బ్రింక్‌ ఆప్‌కు 44 నుంచి 49 సీట్లు, బిజెపికి 21 నుంచి 25 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఎగ్జిట్‌ పోల్స్‌ను ఆప్‌ తిరస్కరించింది. ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి రీనా గుప్తా మాట్లాడుతూ ‘2013, 2015, 2020లోనూ మీరు ఏ ఎగ్జిట్‌ పోల్‌ చూసినా ఆప్‌నకు తక్కువ సీట్లు వస్తాయనే చెప్పారు. ఫలితాల్లో ఆప్‌కు అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి’ అని తెలిపారు.

➡️