Waqf Bill : వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలను బుజ్జగించే యత్నం : బిజెపి మైనారిటీ మోర్చా దేశవ్యాప్త ప్రచారం

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు 2024కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, కొన్ని ముస్లిం సంస్థలు తీవ్ర స్థాయిలో కేంద్రంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లింలను బుజ్జగించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఈ వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలకు ఉన్న అపోహలను, భయాలను తొలగించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలకు అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయనుందని తెలుస్తోంది.
ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని బిజెపి తీవ్రంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్‌ బిల్లు ద్వారా ముస్లింల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది? పార్టీ అసలు లక్ష్యం ఏంటి? అన్నది ముస్లింలకు తెలియజేయాలని బిజెపి చూస్తోంది. వక్ఫ్‌ విషయాలపై అవగాహన ఉన్నవారిని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) సమావేశాలకు హాజరుకావాలని ప్రోత్సహిస్తోంది.
బిజెపి వర్గాల సమాచారం ప్రకారం… దేశ రాజధానిలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సంతోష్‌ నేతృత్వంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమాశానికి వివిధ రాష్ట్రాల వక్ఫ్‌ బోర్డు చైర్మన్లు, మాజీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఇంకా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌ గౌతమ్‌, బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్‌ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. వక్ఫ్‌ బిల్లు సానుకూలాంశాలను ముస్లింలకు తెలియజేయాలని బిజెపి అగ్ర నేతలు నొక్కి చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి.

➡️