- అర్ధరాత్రి ఆలయం తలుపులు తెరవలేదని అనుచరుల వీరంగం
భోపాల్ : మతం పేరుతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఉద్రిక్తతలు రెచ్చగొడుతుండగా, మరోపక్క అధికార పార్టీ నేతల కుటుంబీకులే ఆలయాల నిర్వాహకులపై దాడులు చేస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అర్ధరాత్రి సమయంలో వచ్చి గుడి తలుపులు తెరవాలంటూ ఒక ఆలయ అర్చకుడిపై బిజెపి ఎమెల్యే కుమారుడి అనుచరులు భౌతికదాడి చేశారు. తీవ్రస్థాయిలో దూషణలకు దిగారు. దేవాస్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారటంతో ఎమ్మెల్యే కుమారుడు, ఆయన అనుచరుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు, ఆలయ అర్చకుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు రుద్రాక్ష్ శుక్లా గతవారం తన అనుచరులతో కలిసి 12 కార్లతో కాన్వారుగా అర్ధరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ప్రతిష్టాత్మక చాముండా దేవి ఆలయానికి చేరుకున్నాడు. అప్పటికే గుడి తలుపులు మూసివేసి ఉన్నాయి. ఇంతలో రుద్రాక్ష్ అనుచరుడైన జితేంద్ర రఘువంశీ అక్కడ నానా హంగామా చేశాడు. రుద్రాక్ష్ పూజలు చేస్తాడనీ, గుడి తలుపులు తెరవాలని ఆలయ పూజారితో గొడవకు దిగాడు. రాత్రి సమయంలో తలుపులు తెరవటానికి ఆలయ నిబంధనలు ఒప్పుకోవని పూజారి ఉపదేశ్‌నాథ్ చెప్పడంతో, ఆయనపై జితేంద్ర దాడి చేశాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ ఘటనపై ఫిర్యాదుతో పోలీసులు జితేంద్రపై బిఎన్‌ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో జితేంద్ర పేరు మాత్రమే కనిపించటం, ఎమ్మెల్యే కుమారుడి పేరు లేకపోవటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సిసి టివి ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అన్ని ఆధారాలను పరీక్షించిన తర్వాత తగిన చర్యలుంటాయని చెప్పారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడిని తప్పించే చర్యలు జరుగుతున్నాయనీ, ఇందులో ఆయన హస్తంపై నిగ్గుతేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన తర్వాత.. దానిని ఉపసంహరించుకోవాలంటూ తనకు ఒక ఫోన్‌కాల్ వచ్చిందని ఆలయ పూజారి ఉపదేశ్‌నాధ్ చెప్పారు. ఈ విషయంలో రాజీపడేది లేదని ఆయన ఒక వీడియో సందేశంలో స్పష్టం చేశారు.