ఆప్‌ను నాశనం చేసేందుకే ‘ఆపరేషన్‌ ఝాడూ’

May 20,2024 08:02 #AAP, #BJP 'Operation Jhadu', #Kejriwal
  • మోడీ కుట్ర పన్నారన్న కేజ్రీవాల్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆమాద్మీ పార్టీని పూర్తిగా నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే బిజెపి ‘ఆపరేషన్‌ ఝాడూ’ను చేపట్టిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆప్‌ నేతలను అరెస్టు చేసి జైలుపాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి ఆపరేషన్‌ ఝాదూ చేపట్టాయని అన్నారు.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ పిఎ బిభవ్‌ కుమార్‌ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయానికి ఆప్‌ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. అయితే ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. బిజెపికి ధీటుగా ఆప్‌ ఎదగకుండా నిరోధించేందుకు బిజెపి, ప్రధాని మోడీ కుట్రపూరితంగా ఆపరేషన్‌ ఝాదూను తెరపైకి తీసుకొచ్చాయని అన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆప్‌ నేతలను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారని, వారిని రాబోయే రోజుల్లో అరెస్ట్‌ చేయడంతో ఆప్‌ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేస్తారని విమర్శించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆప్‌ బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తామని ఇడి న్యాయవాది ఇప్పటికే కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఆప్‌ ఖాతాలను ఇప్పుడే ఫ్రీజ్‌ చేస్తే ఆప్‌నకు సానుభూతి లభిస్తుందనే ఉద్దేశంతో మన ఖాతాలను లోక్‌సభ ఎన్నికల అనంతరం ఫ్రీజ్‌ చేసేందుకు కాషాయ పాలకులు స్కెచ్‌ వేశారని విమర్శించారు. ‘ఎన్నికల అనంతరం మన కార్యాలయాన్ని దిగ్బంధించి మనల్ని రోడ్డు మీదకి తీసుకొసారు. బిజెపి ఈ ప్రణాళికలతో ముందుకెళుతున్నంది’ అని కేజ్రీవాల్‌ పార్టీ శ్రేణులకు తెలిపారు.
ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేజ్రీవాల్‌ పిలుపు మేరకు కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు.. ఆప్‌ కార్యాలయం నుంచి ఢిల్లీ బిజెపి ప్రధాన కార్యాలయానికి ప్రదర్శన బయల్దేరగానే పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడ 144 సెక్షన్‌ ఉన్నదని, గుంపులుగా వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో పోలీసులకు ఆప్‌ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మంత్రులు, ఆప్‌ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఆప్‌ నేతలు భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️