రాజ్యాంగంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి : రాహుల్‌ గాంధీ

పాట్నా : అంబేద్కర్‌ వంటి ప్రముఖ దళిత నాయకులపట్ల గౌరవం నటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి నుంచి రాజ్యాంగం దాడికి గురువుతోందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రముఖ దళిత స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్‌ కార్యకర్త జగ్‌లాల్‌ చౌదరి జయంతి సందర్భంగా పాట్నాలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత, విమానంలో ఇక్కడకి చేరుకున్నట్లు రాహుల్‌ తెలిపారు. దళితులు, గిరిజనులు, బిసిలకు అన్ని రంగాల్లోనూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని, కేవలం రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే సరిపోదని తెలిపారు. అధికార యంత్రాంగం, ప్రైవేటు రంగాల్లోనూ వీరు నాయకులుగా ఎదగాలని రాహుల్‌ పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగం అమలులో ఉన్నంత వరకు, దళితులు, సమాజంలోని ఇతర అణగారిన వర్గాలు మెరుగైన జీవితాన్ని ఆశించవచ్చు. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇది తెలుసు, కాబట్టి వారు రాజ్యాంగంపై దాడి చేస్తారు, కానీ బహిరంగంగా కాదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగం ముందు, అంబేద్కర్‌ విగ్రహం ముందు నమస్కరిస్తున్నట్లు మీరు చూడవచ్చు. కొంతమంది ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అంబేద్కర్‌కు భక్తి గీతాలు పాడటం కూడా చూడవచ్చు. వీరంతా అంబేద్కర్‌ ప్రతిపాదించిన ఆదర్శాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అలా నటిస్తారు’ అని రాహుల్‌ విమర్శించారు. మీడియా రంగంలో దళితుల సంఖ్య తక్కువగా ఉందని, అందుకే దళిత సమస్యలకు ప్రాముఖ్యత లభించదని తెలిపారు. విద్యా రంగంలోనూ ‘ప్రశ్నాపత్రాలు రూపొందించే స్థాయికి’ దళితులు చేరుకోలేదని చెప్పారు. ఇక దేశంలోని బిలియనీర్లలో ఒక్క దళితుడు కూడా లేడని అన్నారు. అణగారిన వర్గాలకు మెరుగైన భాగస్వామ్య దిశలో కుల గణన మొదటి అడుగు అని, కులగణనను కాంగ్రెస్‌ ముందుకు తీసుకెళుతుందని రాహుల్‌ ప్రకటించారు.

మేక్‌ ఇన్‌ ఇండియా’ వైఫల్యాన్ని అంగీకరించండి : ప్రధానికి రాహుల్‌ సూచన

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగీకరించాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రధాని తన ప్రసంగంలో మేక్‌ ఇన్‌ ఇండియా గురించి ప్రస్తావించకపోవ డాన్ని గుర్తు చేస్తూ రాహుల్‌ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 2014లో జిడిపిలో 15.3 శాతంగా ఉన్న తయారీ రంగం ప్రస్తుతం 12.6 శాతానికి దిగజారింది. గత 60 ఏళ్లలో ఇది అత్యల్పం’ అని పోస్ట్‌లో రాహుల్‌ తెలిపారు. దేశంలో యువతకు ఉద్యోగాలు చాలా అవసరమని, ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వాలు (ఎన్‌డిఎ, యుపిఎ) ఈ సమస్యను తీర్చలేకపోయాయని రాహుల్‌ అంగీకరించారు.

➡️