బిజెపికి బుద్ధి చెప్పాలి : జన విశ్వాస్‌ సభలో నేతల పిలుపు

Mar 4,2024 10:59 #BJP, #Jana Vishwas Sabha, #leaders

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి బుద్ధి చెప్పాలని ఇండియా ఫోరం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం పాట్నాలో జరిగిన జనవిశ్వాస్‌ సభలో దేశవ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న విభజన, మతతత్వ రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలుత బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాట్లాడుతూ మోడీ అసలు హిందువే కాదన్నారు. కొంత కాలం క్రితం తన తల్లి చనిపోయినప్పుడు మోడీ గుండు ఎందుకు గీసుకోలేదని అన్నారు. తల్లి లేదా తండ్రి చనిపోయినప్పుడు గడ్డం తీసేసి, గుండు చేయించుకోవడం హిందువుల్లో ఒక ఆచారం అని, మోడీ ఆ పని ఎందుకు చేయలేదని లాలూ ప్రశ్నించారు. బిసీల అభ్యున్నతికి బీహార్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా తాను కృషి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని మట్టికరిపిస్తామని ప్రతిన బూనారు. ”ఈ గాంధీ మైదాన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన నేతల సమావేశాలు ఎన్నిసార్లు జరిగాయో తెలియదు. ఇక్కడి నుంచి దేశమంతటా సందేశం వెళ్లింది. బీహార్‌ గాలిలో చాలా బలం ఉంది. దేశ ప్రజలు దానిని అనుకరిస్తారు” అని అన్నారు.

బీహార్‌ మాజీ డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ బిజెపి అబద్ధాల ఫ్యాక్టరీ అని, ఆర్‌జెడి హక్కులు, ఉద్యోగాలు, అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. 17 ఏళ్లలో నితీష్‌కుమార్‌, బిజెపి చేయలేనిది, తమ మద్దతుతో నడిచిన 17 నెలల్లో రాష్ట్రానికి చేయగలిగామని గుర్తు చేశారు. తమ పార్టీ వెనుకబడిన, మైనారిటీ వర్గాల ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ”పిఎం మోడీ ‘మేరా గ్యారెంటీ’ అని చెప్పారు, ఇకపై ‘బిజెపి లేదా ప్రభుత్వ హామీ’ అని చెప్పరు. ఇప్పుడు నేను మీకు ప్రధాని మోడీ హామీలను చెబుతాను. 2014లో ఈ దేశ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అలా చేశారా? అందరికీ ‘పక్కా’ ఇల్లు కట్టిస్తానని కూడా చెప్పాడు, అలా చేశాడా? ఆయన, ఆయన పార్టీ హామీ ఈ దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని, అవాస్తవాలతో తారుమారు చేయడమేనని చెప్పారు.

”నేడు, ఇండియా ఫోరం బిజెపిని యుద్దభూమిలో ఎదుర్కొంటోంది. కేంద్ర ఏజెన్సీలతో బిజెపి ప్రతిపక్షాల్లో భయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తోంది. మేము వారి ముందు తలవంచడానికి ఇక్కడ లేము లేము. అది సాధ్యం కాదు” అన్నారు.

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బీహార్‌ దేశ రాజకీయాలకు నాడీ కేంద్రమని అన్నారు. దేశంలో పెను మార్పులు బీహార్‌ నుండే ప్రారంభమయ్యాయని, మన దేశంలో విద్వేషాలకు తావు లేదని అన్నారు.

రాజ్యాంగ పరిరక్షకులు, రాజ్యాంగ భక్షకుల మధ్య పోటీ: అఖిలేష్‌ యాదవ్‌

                 2024లో ‘రాజ్యాంగ మథనం’ జరగబోతోందని, ఒకవైపు రాజ్యాంగ పరిరక్షకులు, మరోవైపు రాజ్యాంగ భక్షకులు (రాజ్యాంగాన్ని నాశనం చేసే వ్యక్తులు)” అని ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ”కేంద్రం నుంచి బిజెపిని గద్దె దించాలి. యుపిలో 80 లోక్‌సభ సీట్లు, బీహార్‌లో 40 సీట్లు, ఈ మొత్తం 120 సీట్లలో బిజెపిని ఓడించాలి. అప్పుడు కేంద్రంలో బిజెపి అధికారం కోల్పోతుంది. 120 సీట్లలో బిజెపిని ఓడించి, దేశాన్ని రక్షించాలి” అని పిలుపునిచ్చారు.

మహాకూటమి ప్రభుత్వ హయాంలో తేజస్వి 17 నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, తేజస్వి అధికారంలో ఉండి ఉంటే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేర్చి ఉండేవారని తెలిపారు. ”రైతులు సంతోషంగా లేరని, యువతకు ఉద్యోగాలు లేవని, వారి పదేళ్ల పదవీకాలంలో ప్రజలకు సాధించిన ఘనత ఏమిటి? యుపితో పాటు బీహార్‌ కూడా మార్పు దిశగా అడుగులు వేస్తుంది” అని అన్నారు.

రాష్ట్ర రాజధాని అంతటా కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లతో నిండిపోయింది. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ ఆర్‌జెడితోపాటు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మోడీ నియంతృత్వాన్ని ఎదిరిస్తేనే దేశాన్ని రక్షించగలం: సీతారాం ఏచూరిసిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, మోడీ నియంతృత్వాన్ని ఎదిరించకపోతే దేశాన్ని రక్షించలేమని అన్నారు. ”మోడీ హామీ జీరో గ్యారెంటీ. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అందుకే రైతులు మళ్లీ నిరసనకు దిగాల్సి వచ్చింది” అని అన్నారు. సాగర మథనంతో వచ్చిన అమృతం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు, దేశంలో అధికారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని అన్నారు. ఆ అమృతాన్ని తిరిగిపొంది, ప్రజలకు మంచి భవిష్యత్తును అందించడానికి, దేశాన్ని రక్షించడానికి వినియోగించాలని చెప్పారు. మోడీ హఠావో, దేశ్‌ బచావో అని పిలుపునిచ్చారు.

➡️