Blast : ఢిల్లీలోని ప్రశాంత్‌ విహార్‌లో పేలుడు.. ఒకరికి గాయాలు

Nov 28,2024 22:29 #blast, #Delhi, #near PVR, #Prashant Vihar

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో శాంతిభద్రతలు క్రమేపి క్షీణిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ స్వీయ పర్యవేక్షణలో ఉన్న రాజధాని ఇటీవల కాలంలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో గురువారం ఉదయం పేలుడు జరిగింది. రోహిణీలోని ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలో పివిఆర్‌ మల్టీప్లెక్స్‌ సమీపాన తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అదే ప్రాంతంలో పార్క్‌ చేసిన త్రీ వీలర్‌ డ్రైవర్‌కి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు.

”గురువారం ఉదయం 11.48 గంటలకు ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలో పేలుడు జరిగినట్లు కాల్‌ వచ్చింది. ఘటనాస్థలానికి నాలుగు ఫైరింజన్లు తరలించాం. మా బృందాలు మిగిలిన వివరాలను సేకరిస్తున్నాయి” అని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రశాంత్‌ విహార్‌లోని సిఆర్‌పిఎఫ్‌ పాఠశాల సరిహద్దు గోడ సమీపంలో గత నెల పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల ఘటనలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానిదే బాధ్యత అని, వరుస పేలుళ్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి డిమాండ్‌ చేశారు. రోహిణీలో చోటుచేసుకున్న పేలుడు ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. శాంతిభద్రతల వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

➡️