మేధో వైకల్యం ఉంటే మాతృత్వం పొందకూడదా? : బాంబే హైకోర్టు ప్రశ్న

ముంబయి : 21 వారాల గర్భిణిగా ఉన్న యువతికి మేధో వైకల్యం ఉన్నదని తేలితే ఆమెకు మాతృత్వం పొందే హక్కు లేదని ఎలా చెబుతారని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఆ యువతికి మేధో వైకల్యం ఉన్నప్పటికీ మతిస్థిమితం లేని వ్యక్తి కాదని హైకోర్టు నియమించిన మెడికల్‌ బోర్డ్‌ నిర్ధారించింది. దీనిపై జస్టిస్‌ ఆర్వీ ఘుగే, జస్టిస్‌ రాజేష్‌ పాటిల్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ స్పందిస్తూ 27 సంవత్సరాల యువతికి మేధో వైకల్యం ఉన్నదని, అయితే ఆమె ఇంటెలిజెన్స్‌ కోషెంట్‌ (తెలివితేటలను తెలిపే సాధనం…ఐక్యూ) 75గా ఉన్నదని, పైగా ఆమె గర్భాశయంలో అసాధారణతలు లేదా క్రియాత్మక మార్పులు ఏవీ లేవని తెలిపింది.
‘ఎవరూ అత్యంత మేధావులు, తెలివితేటలు కలిగిన వారు కారు. మనమంతా మానవులం. ప్రతి వారిలోనూ భిన్నమైన తెలివితేటలు ఉంటాయి’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తెలివితేటలు సగటు స్థాయి కంటే తక్కువగా ఉన్నంత మాత్రాన ఆమెకు తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని స్పష్టం చేసింది. సగటు కంటే తక్కువ స్థాయిలో తెలివితేటలు కలిగిన వారికి తల్లిదండ్రులయ్యే హక్కు లేదని అంటే అది చట్ట విరుద్ధమేనని చెప్పింది.
మహిళ మానసిక స్థితి సరిగా లేదని, ఆమె అవివాహితురాలని, కాబట్టి గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ మహిళ తండ్రి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే గర్భవిచ్ఛిత్తికి అంగీకరించడానికి ఆ మహిళ నిరాకరించింది. గర్భాన్ని కొనసాగించాలని కోరుకుంది. దీనిపై జనవరి 3న స్పందించిన న్యాయస్థానం మహిళ గర్భంలోని పిండాన్ని పరీక్షించి, నివేదిక అందజేయాలని జేజే ఆస్పత్రి మెడికల్‌ బోర్డును ఆదేశించింది. మహిళ తన గర్భాన్ని కొనసాగించవచ్చునని, అదే సమయంలో గర్భవిచ్ఛిత్తి కూడా సాధ్యమేనని మెడికల్‌ బోర్డు నివేదించింది. మహిళ ఓ పురుషుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని, అయితే వారిద్దరూ మేజర్లే అయినందున అది నేరం కాదని కోర్టు అభిప్రాయపడింది. మహిళతో సంబంధాన్ని కొనసాగించిన వ్యక్తిని సంప్రదించి వివాహం చేసుకునేలా ఒప్పించడానికి ప్రయత్నించాలని తల్లిదండ్రులకు సూచించింది. బిడ్డ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని న్యాయస్థానం తెలిపింది.

➡️