హెల్త్‌ లేబుల్‌ను తొలగించిన బూస్ట్‌, హార్లిక్స్‌

న్యూఢిల్లీ :    తమ ఉత్పత్తులైన హార్లిక్స్‌, బూస్ట్‌లపై హెల్త్‌ లేబుల్‌ను తొలగించినట్లు హిందుస్థాన్‌ యునీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యుఎల్‌) గురువారం ప్రకటించింది. ‘ఫంక్షనల్‌ అండ్‌ న్యూట్రిషనల్‌ డ్రింక్స్‌’ల స్థానానికి మార్చినట్లు తెలిపింది. అన్ని డ్రింకులు, రుచికరమైన పానీయాలను తమ వెబ్‌సైట్‌లలో హెల్త్‌ కేటగిరీ నుండి తొలగించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఈ డ్రింక్స్‌లలో చక్కెర శాతం ఆమోదయోగ్యమైన పరిమితి కన్నా చాలా అధికంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సిపిసిఆర్‌) విచారణ అనంతరం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి) చట్టం 2005 ప్రకారం.. హెల్త్‌ డ్రింక్స్‌ కేటగిరీలోకి రావని ఏప్రిల్‌ 10న జారీ చేసిన ఉత్తర్వుల్లో మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో డైరీ ఉత్పత్తులు, మాల్ట్‌కి చెందిన పానీయాలను హెల్త్‌ కేటగిరీలో చేర్చకూడదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ఇ-కామర్స్‌ సంస్థలను హెచ్చరించింది.

గతేడాది  బోర్న్‌వీటాలో అధిక స్థాయి చక్కెరలను వినియోగిస్తున్నారని ఎన్‌సిపిసిఆర్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

➡️