న్యూఢిల్లీ : నేడు భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సహా పలువరు నేతలు ఆయనకు నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆదర్శాలు స్వయం సమృద్ధిగల వ్యవస్థను సృష్టించడానికి, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలోపేతం చేస్తాయని, మరింత వేగవంతం చేస్తాయని మోడీ అన్నారు.
‘భారతరత్న పూజ్య బాబాసాహెబ్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి తరపున నేను ఆయనకు నమస్కరిస్తున్నాను. ఆయన స్ఫూర్తితోనే దేశం నేడు సామాజిక న్యాయం కలను సాకారం చేసుకోవడంలో అంకిత భావంతో నిమగమై ఉంది. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు ‘ఆత్మనిర్భర్’, ‘వికసిత్ భారత్’ సృష్టికి బలాన్ని, వేగాన్ని ఇస్తాయి’ అని మోడీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రతి భారతీయుడి సమాన హక్కుల కోసం, ప్రతివర్గం భాగస్వామ్యం కోసం ఆయన చేసిన పోరాటం, సహకారం రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటంలో ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తుంది అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ‘బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ దేశ ప్రజలకు భారత రాజ్యాంగాన్ని అందించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ఇది సామాజిక న్యాయం, సమిళిత అభివృద్ధికి అత్యంత శక్తివంతమైన సాధనం. దేశ పురోగతికి, ఐక్యత కోసం సమ్మిళితత్వాన్ని తన అంతిమ కర్తవ్యంగా ఆయన అభివర్ణించారు. అందరి హక్కులను పరిరక్షించాలని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. ఆయన 135వ జయంతి సందర్భంగా సామాజిక మార్పు, సామాజిక న్యాయం అనే ఆయన ఆలోచనలకు మా అంచంచల నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. రాజ్యాంగ విలువల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేస్తుంది’ అని ఖర్గే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.